తాజాగా తెరపైకి హిండెన్‌బర్గ్ – సెబీ వివాదం
క్యూ1 ఫలితాలు, ఆర్థిక గణాంకాలపైనా దృష్టి
ఆగస్టు 15న సెలవు
ట్రేడింగ్ నాలుగు రోజులే
ఈ వారం స్టాక్ మార్కెట్‌పై నిపుణుల అంచనా
సెబీ చైర్‌పర్సన్ మాధవీ పురీ బచ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున ఈ వారం స్టాక్ సూచీలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాలు విడుదల చేసే స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుందంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న(గురువారం) ఎక్స్చేంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగురోజులకు పరిమితం కానుంది.
నిపుణులు అంచనాల ప్రకారం..ప్రపంచ మార్కెట్ల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. క్రూడాయిల్ ధరలు తగ్గడం కలిసొచ్చే అంశమే. క్యూ1 ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పాటు అధిక వాల్యుయేషన్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వృద్ధి ఆధారిత షేర్లకు బదులుగా వాల్యూ స్టాకులను కొనుగోలు చేయడం మంచిది. నిఫ్టీ ఎగువ సాంకేతికంగా 24,400 వద్ద కీలక నిరోధం కలిగి ఉంది. ఆ స్థాయిని చేధిస్తే తిరిగి 25,000 పాయింట్లను అందుకోవచ్చు. దిగువ స్థాయిలో 24,000 వద్ద తక్షణ మద్దతు కలిగి ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అమెరికా మాంద్య భయాలు, యెన్ అనూహ్య ర్యాలీ, లాభాల స్వీకరణతో పాటు ఆర్‌బీఐ కఠినతర వైఖరి అమలు యోచనల నేపథ్యంలో గతవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,276 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
హిండెన్‌బర్గ్ – సెబీ వివాదం
సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్, ఆమె భర్త ధావల్ బచ్‌లకు అదానీకి చెందిన విదేశీ ఫండ్లలో వాటాలున్నట్లు హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దలాల్‌స్ట్రీట్ స్పందన కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు.
స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం
దేశీయ జూలై రిటైల్ ద్రవ్యోల్బణ డేటా పాటు జూన్ పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. భారత జూలై డబ్ల్యూపీ(హోల్‌సేల్) ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు అమెరికా ద్రవ్యల్బోణ డేటా ఆగస్టు 14న(బుధవారం) వెల్లడి కానుంది. అదేరోజున యూరోజూ క్యూ2 వృద్ధి డేటా, జూన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, బ్రిటన్ జూల్ ద్రవ్యోల్బణం, రిటైల్ ప్రైజ్ ఇండెక్స్ డేటా వెల్లడి కానుంది. ఆగస్టు 15న చైనా, జపాన్, అమెరికా బ్రిటన్‌ల జూన్ మాసపు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు, నిరుద్యోగ డేటాలు విడుదల కానున్నాయి. వారాంతాపు రోజున ఆగస్టు 9 వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్‌బీఐ ప్రకటించనుంది. ఆదే రోజున బ్రిటన్ జూలై రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ జూన్ వాణిజ్య లోటు గణాంకాలు విడుదల కానున్నాయి.
చివరి దశకు ఫలితాల సీజన్
కార్పొరేట్ ఫలితాల సీజన్ చివరి దశకు చేరింది. నిఫ్టీ 50 సూచీలోని 50 కంపెనీల్లో 46 కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను విడుదల చేశాయి. వొడాఫోన్ ఐటీ, హిందాల్కో, హీరో మోటోకార్ప్, నైకా, హెచ్‌ఏఎల్, అపోలో హాస్పిటల్ ఈ వారం ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. వాటితో పాటు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, బజాజ్ హిందుస్థాన్ షుగర్స్, బలరామ్‌పుర్ చినీ మిల్స్, డూమ్స్ ఇండస్ట్రీస్, హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, హిందుస్థాన్ కాపర్ కంపెనీలూ ఇదే వారంలో తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. క్యూ1 ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పాటు అధిక వాల్యుయేషన్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వృద్ధి ఆధారిత షేర్లకు బదులుగా వాల్యూ స్టాకులను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment