రాహుల్‌ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి: కంగనా | Rahul Gandhi most dangerous man: Kangana Ranaut hits out Hindenburg remark | Sakshi
Sakshi News home page

రాహుల్‌ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి: కంగనా

Published Mon, Aug 12 2024 3:49 PM | Last Updated on Mon, Aug 12 2024 4:00 PM

Rahul Gandhi most dangerous man: Kangana Ranaut hits out Hindenburg remark

కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ మాధవీ బుచ్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రాహుల్‌ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రధాని కాలేదన్న నిరాశలో దేశాన్నికూడా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఈ మేరకు ఎక్స్‌లో.. ‘రాహుల్‌ గాంధీ చాలా విషపూరితమైన,  ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన ప్రధాని కాలేదనే నిరాశలో దేశాన్ని, ఆర్థిక పరిస్థితిని అస్థిరపరిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత రాత్రి రాహుల్‌.. స్టాక్‌ మార్కెన్‌ను లక్ష్యంగా చేసుకొని హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికకు వత్తాసు పలికారు. దేశ ప్రజల కీర్తిని, ఎదుగుదలను చూసి మీరు బాధపడుతున్న తీరు చూస్తుంటే మిమ్మల్ని ప్రజలు ఎప్పటికీ తమ నేతగా గెలిపించరు. రాహుల్‌ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండిపోయేందుకు సిద్ధంగా ఉండాలి’ చురకలంటించారు.

 కాగా హిండెన్‌బర్గ్‌ నివేదికపై రాహుల్ గాంధీ స్పందిస్తూ..‘ ఛైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో సెబీ పవిత్రత దెబ్బతింది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేస్తున్నారు. సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పురి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? ఒకవేళ ఇన్వెస్టర్లు తాము కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతే..ఎవరిది బాధ్యత? ప్రధాని మోదీనా? సెబీ ఛైర్‌పర్సనా? లేదా అదానీనా? ఈ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి సుమోటోగా విచారణ చేపడుతుందా?’ అని ‘ఎక్స్‌’ వేదికగా  మండిపడ్డారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement