రోల్డ్‌గోల్డ్ ఆభరణాలే దిక్కంటున్న సామాన్యులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రపంచంలో ఏ వస్తువు ధర పెరగనంతగా బంగారం ధరలు పెరుగుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. కనకం ధర పాతికేళ్ల కాలంలో ఊహించని స్థాయిలో పెరిగి కొండెక్కింది. గురువారం మార్కెట్‌లో మేలిమి బంగారం తులం (10 గ్రాములు) రూ.79 వేల మార్కును దాటింది. 2000 సంవత్సరంలో తులం బంగారం రూ. 4,400 ఉండగా ఇప్పుడు రూ.79 వేలకు చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలో ఏ వస్తువుగానీ, లోహం ధరగానీ ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు లేవు. భారతీయులకు బంగారమంటే మక్కువ ఎక్కువ. శుభకార్యాలలో ఎవరి తాహతుకు తగ్గట్లుగా వారు ఆభరణాలను ధరిస్తుంటారు. కానుకలుగా బంగారం ఇస్తుంటారు.
పెళ్లిళ్లలో అయితే తప్పనిసరి. కూతురు పెళ్లి చేయాలంటే తక్కువలో తక్కువ 5 తులాల బంగారం కట్నంగా పెట్టాల్సిందే. ఐదు తులాలు అంటే ప్రస్తుతం రూ. 4 లక్షలు అవుతుంది. ధర భారీగా పెరగడంతో సామాన్యులకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. చాలామంది బంగారు ఆభరణాలను కొనలేని పరిస్థితిలో ఇమిటేషన్ జ్యువెలరీని ఆశ్రయిస్తున్నారు. బంగారం ధరల పెరుగుదలపై కామారెడ్డికి చెందిన మూడు తరాలవారితో ‘సాక్షి’ మాట్లాడింది. ఒక తరంలో ఉన్న ధరకు, తరువాతి తరంలో ఉన్న ధరకు పొంతన లేకుండా పెరుగుదల కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు.
నూరు రూపాయలుండే..
నా పెళ్లి 1954 సంవత్సరంలో అయ్యింది. అప్పుడు బంగారం తులం నూరు రూపాయలు ఉండేది. అప్పుడు ధర తక్కువే అయి నా సంపాదన కూడా తక్కువగానే ఉండేది. ఇప్పుడు ధరలు చాలా పెరిగి పోయాయి. బంగారం ధర వింటేనే భయమేస్తుంది.
– పొగాకు నర్సుబాయి, కామారెడ్డి
తులానికి రూ. 1400 ఉండేది..
నా పెళ్లి 1980 లో జరిగింది. అప్పట్ల తులం బంగారం ధర రూ. 1,400 ఉండేది. ఆ ధర ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది కానీ అప్పటిది అప్పుడు, ఇçప్ప టిదిప్పుడు అన్నట్టుగా నే ఉంది. బంగారం ధరలు బాగా పెరిగి, సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితికి చేరింది.
– మైలారపు అంజలి, పొగాకు నర్సుబాయి కూతురు, కామారెడ్డి
తులానికి రూ.5,500 ఎక్కువ అనుకున్నం...
నా వివాహం 2003 సంవత్సరంలో జరిగింది. అప్పుడు తులం బంగారం ధర రూ.5,500 ఉండేది. అప్పట్లో ఆ ధరే చాలా ఎక్కువ అనుకున్నం. తరువాత ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు రూ.79 వేలు అంటుంటే ఆశ్చర్యపోతున్నాం. ఇరవై ఏళ్లల్లో ధర అడ్డగోలుగా పెరిగింది.
– ముప్పారపు అపర్ణ, పొగాకు నర్సుబాయి మనవరాలు, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment