
న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీ కృత్రిమ మేథ (ఏఐ)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అయితే వాటితో పాటు రిస్కులూ పొంచి ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తెలిపారు. ఏఐని అభివృద్ధి చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కృత్రిమ మేథపై అంతర్జాతీయ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
పూర్తి స్థాయి కృత్రిమ మేథ వల్ల మానవాళి అంతమయ్యే పరిస్థితి తలెత్తుతుందంటూ ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా సారస్వత్ ప్రస్తావించారు. ఏఐని ఒక్కసారి రూపొందించాక .. అది తనంతట తానే వేగంగా వృద్ధి చెంది, మనుషులను అధిగమించేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
జీవసంబంధ పరిమితుల వల్ల మనుషులు దానితో పోటీపడలేరన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సారస్వత్ చెప్పారు. 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు ఏఐ 1 లక్ష కోట్ల డాలర్లను జోడించగలదని .. అదే సమయంలో సమాజంపైనా చాలా ప్రభావం చూపగలదని ఆయన పేర్కొన్నారు.