ఐటీ కారిడార్‌లో మారుతున్న ట్రెండ్‌.. | Hybrid Work Model In The Indian IT Sector | Sakshi
Sakshi News home page

ఐటీ కారిడార్‌లో మారుతున్న ట్రెండ్‌..

Published Thu, Feb 29 2024 2:38 PM | Last Updated on Thu, Feb 29 2024 5:42 PM

Hybrid Work Model In The Indian IT Sector - Sakshi

వర్క్‌ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని ఐటీ కారిడార్లు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. కరోనా భయం తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోంకు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. హైబ్రిడ్‌ మోడల్‌ను అనుసరిస్తుండటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నెలలుగా ఐటీ కారిడార్‌లో క్రమంగా కార్యకలాపాలు గాడిన పడ్డాయి. హాస్టళ్లలో గదులు నిండుతున్నాయి. మాల్స్‌ సందర్శకులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిరువ్యాపారులు, హోటళ్లు, ట్రావెల్స్‌, డ్రైవర్ల జీవన ప్రయాణం గాడిలో పడింది.

ఏమిటీ హైబ్రిడ్‌ మోడల్‌?

ఐటీ కంపెనీల్లో అన్ని విభాగాల ఉద్యోగులు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి మిగతా రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేసేలా ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ విధానానికి  హైబ్రిడ్‌ మోడల్‌ అనే పేరు వాడుకలోకి వచ్చింది. చిన్న కంపెనీల్లో ఉద్యోగులు వంద శాతం కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీ భవనాలు 65 శాతం ఆక్యుపెన్సీతో పని చేస్తున్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. 

బహుళజాతి కంపెనీలు మాత్రం పూర్తిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను ఎత్తేసే ఆలోచన చేయడం లేదు. అలాగని ఉద్యోగులు కార్యాలయానికి రావాలంటూ ఒత్తిడి చేయడం లేదు. కొన్ని బడా కంపెనీలు మాత్రం వంద శాతం వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వారికి సందేశాలు పంపించాయి. అత్యధిక ఉద్యోగులు హైబ్రిడ్‌ మోడల్‌లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో కొన్ని కంపెనీలు హైబ్రిడ్‌ మోడల్‌ను పాటించేందుకు సిద్ధపడుతున్నాయి. 

ప్రముఖ కంపెనీల్లో ఇలా..

ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్‌మ్యాన్‌ సాక్స్, జేపీ మోర్గాన్‌ తదితర కంపెనీలపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్‌ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్‌’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. తాజాగా ఇన్ఫోసిస్‌ సంస్థ నెలలో 11 రోజుల పాటు ఇంటి నుంచి పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది.

ప్రయోజనాలివే..

ఉద్యోగులకు కొంతకాలంపాటు హైబ్రిడ్‌ వర్క్‌కు అనుమతించడం ద్వారా కంపెనీలు మౌలిక సదుపాయాల ఖర్చులను గణనీయంగా ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ పని వాతావరణం కారణంగా ఐటీ కంపెనీలు తమ మౌలిక సదుపాయాల ఖర్చుల్లో కనీసం 50% ఆదా చేసుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగులు ఆసక్తిమేరకు పనిచేస్తే ఆఫీస్‌లో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా సమర్థంగా పనిచేస్తారు. అయితే కావాల్సిందల్లా వారిలో ఆసక్తిని రేకిత్తించడమే. అందుకు కంపెనీ యాజమాన్యాలు, టీమ్‌ నాయకులు ప్రత్యేక చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. 

హైబ్రిడ్‌ వర్క్‌లో తక్కువ ముందే ఆఫీస్‌కు వస్తారు కాబట్టి ఫోకస్‌గా పనిచేసే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగులు సృజనాత్మకతతో విధులు నిర్వర్తిస్తారని చెబుతున్నారు. టీమ్‌లోని సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. దాంతో క్రాస్-కల్చరల్ వాతావరణం పెంపొందుతుందని నిపుణులు తెలుపుతున్నారు. 

ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్‌!

మూన్‌లైటింగ్‌కు చెక్‌..

హైబ్రిడ్‌ మోడల్‌లో భాగంగా ప్రధానంగా పనిచేస్తున్న కంపెనీలోనే వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ఇతర కంపెనీలకు చెందిన రహస్య పని ఒప్పందాలు(మూన్‌లైటింగ్‌ ) ఇకపై సాగవు. దాంతో కంపెనీల సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా కొందరు ఉద్యోగులు రహస్యంగా రెండో ఉద్యోగం (మూన్‌ లైటింగ్‌) కూడా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇది ఉద్యోగుల నైతికత మీద ఆధారపడి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement