ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 31 శాతం ఎగసి రూ. 8,007 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 37 శాతం జంప్‌చేసి రూ. 7,558 కోట్లకు చేరింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 5,511 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 26% వృద్ధితో రూ. 14,707 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్లు 0.3% బలపడి 4.31%కి చేరాయి.
ఇతర ఆదాయం అప్
ప్రస్తుత సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీయేతర ఆదాయం(ట్రెజరీమినహా) 17 శాతం పుంజుకుని రూ. 5,139 కోట్లను తాకింది. ట్రెజరీ ఆదాయం గత క్యూ2లో రూ. 397 కోట్లుకాగా.. ప్రస్తుతం రూ. 85 కోట్ల నష్టంగా నమోదైంది. ప్రొవిజన్లు రూ. 2,713 కోట్ల నుంచి రూ. 1,643 కోట్లకు వెనకడుగు వేశాయి. స్థూల మొండిబకాయిలు 4.82 శాతం నుంచి 3.19 శాతానికి తగ్గాయి. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో నమోదైన 3.41 శాతంతో పోల్చినా మెరుగుపడ్డాయి. తాజా స్లిప్పేజీలు రూ. 4,300 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఎండీ, సీఈవో సందీప్ బక్షి పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ బోర్డు ఏకగ్రీవంగా అనుమతించినట్లు బ్యాంక్ తాజాగా పేర్కొంది.
అనుబంధ సంస్థలు ఇలా
బ్యాంక్ అనుబంధ సంస్థలలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాభం రూ.445 కోట్ల నుంచి రూ.199 కోట్లకు క్షీణించింది. ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లాభం 32% ఎగసి రూ.591 కోట్లను తాకింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లాభం 6 శాతం పుంజుకుని రూ.406 కోట్లయ్యింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం రూ. 51 కోట్లు తగ్గి రూ.300 కోట్లకు పరిమితమైంది.
చదవండి: ముదురుతున్న మూన్‌లైటింగ్.. తెరపైకి మరో కంపెనీ, అసలేం జరుగుతోంది!
Comments
Please login to add a commentAdd a comment