International Monetary Fund: Gita Gopinath to take on new role as First Deputy Managing Director - Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్‌.. ఎక్కాలే రాని చిన్నారి.. ఇప్పుడు ఏకంగా ఐఎంఎఫ్‌లో నెం.2!!

Published Fri, Dec 3 2021 11:01 AM | Last Updated on Fri, Dec 3 2021 5:30 PM

IMF Gita Gopinath to take on new role as First Deputy Managing Director - Sakshi

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు గురువారం ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థ ఐఎంఎఫ్‌కు ఇంతకుముందు తొలి ఉమెన్‌ ఛీఫ్‌ ఎకనమిస్ట్‌గా చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్‌.. ఇప్పుడు మరో ఘనత దక్కించుకున్నారు. ఏకంగా ఫస్ట్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారామె.
 

ప్రస్తుతం ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు నెంబర్‌ 2గా ఉన్నజియోఫ్రె విలియమ్‌ సెయిజి ఒకమోటో( ఫస్ట్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌).. వచ్చే ఏడాది మొదట్లో బాధత్యల నుంచి తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని గీతా గోపినాథ్‌తో భర్త చేయనుంది ఐఎంఎఫ్‌. నిజానికి ఆమె వచ్చే ఏడాది జనవరిలో ఐఎంఎఫ్‌ను వీడి.. హర్వార్డ్‌ యూనివర్సిటీలో చేరతానని ప్రకటించుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది ఐఎంఎఫ్‌. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిలో 68 ఏళ్ల క్రిస్టలీనా జార్జియేవా(బల్గేరియా) కొనసాగుతోంది.  ఇక ఇప్పుడు రెండో పొజిషన్‌లో గీతా గోపినాథ్‌(49) నియమితురాలయ్యింది. దీంతో కీలకమైన ఒక అంతర్జాతీయ ఆర్థిక విభాగపు కీలక బాధ్యతల్ని ఇద్దరు మహిళలు చూసుకోబోతున్నారన్నమాట. 

మైసూర్‌ టు వాషింగ్టన్‌

గీతా గోపినాథ్‌.. పుట్టింది డిసెంబర్‌ 8, 1971 కోల్‌కతా(కలకత్తా)లో.  అయితే ఆమె చదువు మొత్తం మైసూర్‌ (కర్ణాటక)లో సాగింది. చిన్నతనంలో గీతాకు చదువంటే ఆసక్తే ఉండేది కాదట. ముఖ్యంగా ఎక్కాల్లో ఆమె సుద్దమొద్దుగా ఉండేదని గీత తల్లి విజయలక్క్క్ష్మి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. ఇక ఏడో తరగతి నుంచి చదువులో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ వచ్చిన గీత.. ఫ్లస్‌ టు సైన్స్‌లో విద్యను పూర్తి చేసింది. అయితే డిగ్రీకొచ్చేసరికి తనకు ఏమాత్రం సంబంధం లేని ఎకనమిక్స్‌ను ఎంచుకుని పేరెంట్స్‌ను సైతం ఆశ్చర్యపరిచిందామె. ఢిల్లీలోనే బీఏ, ఎంఏ ఎకనమిక్స్‌ పూర్తి చేసి.. ఆపై వాషింగ్టన్‌లో మరో పీజీ, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకుంది. ఈ రీసెర్చ్‌కి గానూ ఆమెకు ప్రిన్స్‌టన్‌ వుడ్‌రో విల్సన్‌ ఫెలోషిప్‌ రీసెర్చ్‌ అవార్డు అందుకుంది. ఆపై చికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారామె.

కీలక బాధ్యతలెన్నో..

2018, అక్టోబర్‌లో ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌కు ఛీఫ్‌ ఎకనమిస్ట్‌గా గీతా గోపీనాథ్‌ నియమించబడింది. అంతేకాదు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి కూడా ఆమెనే!. ఇక  ఆ పదవిలో కొనసాగుతూనే.. ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌కు కో డైరెక్టర్‌గా, నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌లో మాక్రోఎకనమిక్స్‌ ప్రొగ్రామ్‌ను నిర్వహించారామె. ఇంతేకాదు ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌లో ఎకనమిక్‌ అడ్వైజరీ ప్యానెల్‌లో సభ్యురాలిగా, కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా, ఈ ఏడాది జూన్‌లో వరల్డ్‌ బ్యాంక్‌-ఐఎంఎఫ్‌ హైలెవల్‌ అడ్వైజరీ గ్రూపులో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. 

గౌరవాలు
2011లో యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ నుంచి అవార్డుతో పాటు 2019లో భారత సంతతి వ్యక్తి హోదాలో ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారం  అందుకున్నారామె. కరోనా సంక్షోభంలో ఐఎంఎఫ్‌ తరపున ఆమె అందించిన సలహాలు, కార్యనిర్వహణ తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

వ్యక్తిగత జీవితం
గీతా గోపీనాథ్‌ భర్త ఇక్బాల్‌ సింగ్‌ ధాలివాల్‌.. మాజీ ఐఏఎస్‌ ఈయన. 1995 ఏడాది సివిల్స్‌ పరీక్షల్లో ఫస్ట్‌ ర్యాంకర్‌ ఆయన. కొంతకాలం విధులు నిర్వహించి.. ఆపై ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈయన కూడా ఆర్థిక మేధావే. ప్రస్తుతం మస్సాచుషెట్స్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌, జే-పాల్‌లో ఎకనమిక్స్‌ విభాగంలో గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ జంటకు ఒక బాబు.. పేరు రోహిల్‌. గీతా గోపినాథ్‌కు ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు అమెరికన్‌ పౌరసత్వం కూడా ఉంది.

-సాక్షి, వెబ్‌స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement