సాక్షి, హైదరాబాద్ 2020 తర్వాత మూడో సంవత్సరం, రెండో నెల, మొదటి రోజున ఐదో సారి 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 6.10 నుంచి 6.80 శాతం అభివృద్ధి రేటు ధీమాతో సప్త ప్రాధాన్యతలతో ఎనిమిది రకాలుగా రూపాయి ఎలా వస్తుందో.. తొమ్మిది రకాలుగా రూపాయి ఎలా ఖర్చు పెట్టనున్నారో పేర్కొన్నారు. ‘‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’’ నినాదంతో సప్తరుషులను స్మరించేలా ఏడు విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది. ఇతర విషయాల జోలికి పోకుండా మనం కేవలం ఆదాయ పన్నుకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించుకుందాం.
- ఈ బడ్జెట్‌లో చేసిన మార్పులు చట్టంగా మారి 2023-24 ఆర్థిక సంవత్సరానికి అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు వర్తిస్తాయి.
- 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 అని అర్థం చేసుకోవాలి.
- ఈ మార్పులన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్తించవు. 2023 మార్చి 31 తర్వాత మీరు దాఖలు చేసే రిటర్న్స్‌కు ఇవి వర్తించవు.
- ప్రస్తుతం ట్యాక్స్ చెల్లింపుదారులకు రెండు రకాల రిటర్న్స్ పద్ధతులు ఉన్నాయి. ఒకటి పాత ట్యాక్స్ విధానం.. మరొకటి కొత్త విధానం. పాత పద్ధతిలో బేసిక్ లిమిట్ రూ. 2.50 లక్షల తర్వాత 3 శ్లాబులు.. అంటే పన్ను శాతాలు వరుసగా 5 శాతం, 20 శాతం, 30 శాతం. ఈ విధానంలో మినహాయింపులు ఉంటాయి. కొత్త పన్ను విధానంలో ఎటువంటి మినహాయింపులు ఉండవు. బేసిక్ లిమిట్ రూ. 2.50 లక్షలు కాగా, 6 శ్లాబులు అంటే.. 5, 10, 15, 20, 25, 30 శాతంగా ఉంటాయి.
- ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు ఎంచుకోవచ్చు.
- రాబోయే బడ్జెట్‌లో ఈ రెండూ కొనసాగుతాయి. మీకు నచ్చినదాంట్లో మీరు మీ ఆదాయాన్ని లెక్కించుకోవచ్చు.
- పాత పద్ధతిలో ఎటువంటి మార్పులు లేవు. శ్లాబుల్లోనూ మార్పు లేదు. రేట్లలో కూడా ఎటువంటి మార్పు లేదు. 60 సంవత్సరాల లోపు వారికి 60-80; 80 ఏళ్లు దాటిన వారికి బేసిక్ లిమిట్లలోనూ ఎటువంటి మార్పూ లేదు.
- సేవింగ్స్, జీవిత బీమా, ఎన్‌ఎస్‌సీలు, ఇంటి రుణం మీద వడ్డీ, మినహాయింపుల విషయంలో ఎటువంటి మార్పులు లేవు.
- ఇతర మినహాయింపులు, తగ్గింపుల విషయంలో ఏ మార్పులు లేవు. ఈ విషయంలో సీతమ్మ ఎటువంటి కరుణ చూపలేదు. కొత్త పద్ధతి కొనసాగిస్తూ కొన్ని మార్పులు చేశారు.
- కొత్త పద్ధతిలో కూడా రూ. 50 వేలు స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తారు. ఈ మేరకు ఆదాయం తగ్గుతుంది.
- ఫ్యామిలీ పెన్షన్ రూ. 15 వేలు వరకు తగ్గిస్తారు. ఈ మేరకు ఆదాయం తగ్గుతుంది.
- అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కి చెల్లించిన మొత్తాన్ని కూడా తగ్గిస్తారు. ఆదాయమూ తగ్గుతుంది.
- బేసిక్ లిమిట్‌ని రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. దీంతో పన్ను భారం తగ్గుతుంది.
- శ్లాబులు మార్చారు. వీటి వల్ల పన్ను భారం తగ్గుతుంది.
- రూ. 7 లక్షల వరకు ఎటువంటి పన్ను భారం ఉండకుండా రిబేటును పొందుపర్చారు. ఇది వేతన జీవులకు చిన్న ఊరట.
Comments
Please login to add a commentAdd a comment