న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ చేపట్టిన సమగ్ర విధానాలు 2014 నుండి దేశ సామాజిక, ఆర్థిక పురోగతికి దారితీశాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని అన్నారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆకర్షణీయ ప్రదేశంగా రూపొందిందనీ, ప్రపంచం దేశంపై తన విశ్వాసాన్ని ఉంచుతోందని పేర్కొన్నారు.
2047 నాటికి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే ప్రస్తుత నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలు తమ విశ్వాసాన్ని కొనసాగించాలని వైష్ణవ్ కోరారు. 2014లో మోదీ ప్రభుత్వం అదికారంలోనికి వచ్చినప్పుడు దేశ ఎకానమీ ప్రపంచంలో పదవ స్థానంలో ఉందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ఇది 5వ స్థానానికి మెరుగుపడిన విషయం తెలిసిందేనన్నారు. మోదీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి కూడా అయిన వైష్ణవ్ మాట్లాడారు.
ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
► ఆరేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రభుత్వ హయాంలో ఎకానమీ పటిష్టంగా పురోగమిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడుతోంది. దేశాభివృద్ధే దృఢ సంకల్పంగా పూర్తి సానుకూల వాతావరణంలో కార్యకలాపాలు నిర్వహణ జరుగుతోంది.
► కేంద్రం చేపట్టిన పలు పథకాలు, విధానాలు ప్రజలను ఆర్థికంగా శక్తివంతులను చేశాయి. వారి జీవితాలో నాణ్యతను పెంచాయి.
► దేశ ప్రజల భవిష్యత్తు నేటి భారత్‌లో నిర్మితమవుతోంది. 2047 నాటికి, మీరు అభివృద్ధి చెందిన దేశంలో నివసిస్తారు. మీరు పురోగతి బాటన దేశాన్ని నడిపే మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వోటుచేస్తే, భారత్ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది.
► ప్రధానమంత్రి నాయకత్వం కొత్త ఆలోచనా విదానాన్ని, దృక్పథాన్ని తీసుకొచ్చింది. దేశాభివృద్ధికి సానుకూలంగా ఆలోచనలను
మార్చింది.
► గతంలో పేదలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసేవారు. 2014 నుండి ప్రభుత్వ పథకాలు ప్రజల సాధికారతకు దారితీశాయి. పరివర్తన, గుణాత్మక మార్పులను తీసుకువచ్చాయి. ప్రభుత్వ సేవలు, ఆర్థిక ఫలాలు అట్టడుగు స్థాయికి అందజేసేలా నిరంతరం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం చేసే ప్రతి పైసా పేదల పురోగతికి దోహదపడాలన్నది కేంద్రం లక్ష్యం. సమాజంలోని బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్న తీరును ఆయా అంశాలు ప్రతిబింబిస్తున్నాయి.
► వ్యాక్సిన్లను సకాలంలో పొందడం నుండి (కోవిడ్ సమయంలో), సురక్షితమైన తాగునీటిని అందించడం వరకూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సరసమైన గృహాలను అందించడం నుండి రైలు, విమాన రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వరకు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ దేశంలో వాస్తవ, సానుకూల మార్పును తీసుకువచ్చాయి. సమగ్ర పురోగతికి ఆయా చర్యలు దోహదపడుతున్నాయి.
► నేడు దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. 12 కోట్ల మందికి నీటి కనెక్షన్లు జతయ్యాయి. 9.6 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను అందించారు.
► భారత్ నేడు ఆయుష్మాన్ భారత్ కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ బీమా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది అవసరమైన వారికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం తగిన సౌలభ్యత కల్పిస్తోంది. ఈ పథకం మొత్తం కవరేజీ అమెరికా, రష్యా జనాభా కంటే ఎక్కువ.
► ఇక దేశీయ మౌలిక సదుపాయాలు కూడా 2014 నుండి చక్కటి పురోగతి రూపాన్ని పొందాయి. గతంలో సరైన ఆలోచనా విధానం లేకపోవడం 2014కు ముందు ఈ రంగం అంతగా పురోగతి చెందలేదు.
► తొమ్మిదేళ్లలో 74 విమానాశ్రయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2014 వరకు ఏర్పాటు చేసిన సంఖ్యకు సమానం. భారతదేశం 2014 వరకు జలమార్గాలు లేని స్థితిలో ఉండేది. ప్రస్తుతం దేశంలో ఈ సంఖ్య 111గా ఉంది. దేశంలోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ జరుగుతోంది. విమానాశ్రయాల మాదిరిగానే ప్రపంచ స్థాయి సౌకర్యాలను రైల్వేల్లో కల్పించడం జరుగుతోంది.
► ఇక దేశంలో డిజిటల్ సాంకేతికత పురోగతి పటిష్టంగా కొనసాగుతోంది. ఇది పేదలకు కొత్త అవకాశాలను తీసుకువచ్చింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య కూడా భారీగా పెరగడం ఇక్కడ గమనించాల్సిన అంశం.
Comments
Please login to add a commentAdd a comment