
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 1.84 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆగస్టులో ఇది 1.31 శాతం కాగా, 2023 సెప్టెంబర్‌లో అసలు పెరుగుదల లేకపోగా -0.07 శాతం క్షీణించింది. కూరగాయల ధరలు ప్రత్యేకించి ఆలూ, ఉల్లి ధరల తీవ్రత అధికంగా ఉంది. సమీక్షా నెల్లో మూడు ప్రధాన విభాగాలు చూస్తే..
ఫుడ్ ఐటమ్స్ టోకు ద్రవ్యోల్బణం 11.53 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.11 శాతం కావడం గమనార్హం. ఆగస్టులో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా -10.01 శాతం తగ్గుదల నమోదయ్యింది. అయితే సమీక్షా నెల సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు ఏకంగా 48.73 శాతంగా ఉంది. ఆలూ ధరలు 78.13 శాతం పెరిగితే, ఉల్లి ధరలు ఏకంగా 78.82 శాతం ఎగశాయి.
ఇంధనం, విద్యుత్ విభాగంలో ధరలు 4.05 శాతం తగ్గాయి.
రిటైల్ ధరలూ భారమే..!
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబర్‌లో తీవ్రంగా ఉండడం గమనార్హం. సమీక్షా నెల్లో ఈ స్పీడ్ ఏకంగా 9నెలల గరిష్ట స్థాయిలో 5.49 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.65 శాతం. అధిక కూరగాయల ధరలు దీనికి కారణమని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. జాతీయ గణాంకాల కార్యాలయం వివరాల ప్రకారం ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.24 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 5.66 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే నెల్లో 6.62 శాతం.