మరింతగా ఫారెక్స్‌ మెరుపులు | India Forex Reserves Rise By 889 Million dollers To Lifetime High | Sakshi
Sakshi News home page

మరింతగా ఫారెక్స్‌ మెరుపులు

Published Sat, Aug 14 2021 6:10 AM | Last Updated on Sat, Aug 14 2021 6:10 AM

India Forex Reserves Rise By 889 Million dollers To Lifetime High  - Sakshi

ముంబై: భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త చరిత్రాత్మక రికార్డులను నమోదుచేసుకుంటున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆగస్టు 6వ తేదీతో ముగిసిన వారంలో (అంతక్రితం జూలై 30తో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్‌ నిల్వలు భారీగా 889 మిలియన్‌ డాలర్లు పెరిగి 621.464 బిలియన్‌ డాలర్లకు చేరాయి. భారత్‌ కరెన్సీలో ఇవి దాదాపు రూ.46 లక్షల కోట్లు.

2020 జూన్‌ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు అర ట్రిలియన్‌ స్థాయిని అధిగమించి 501.70 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ,  నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్‌ డాలర్లపైగా పెరిగాయి. జూన్‌ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్‌ డాలర్లను దాటాయి. అటు తర్వాత కొంత తగ్గినా... పురోగమన బాట కొనసాగుతోంది. తాజా సమీక్షా వారంలో రికార్డుల దూకుడు కొనసాగింది.

ప్రస్తుత నిల్వలు భారత్‌ 20 నెలల దిగుమతులకు  దాదాపు సరిపోతాయన్నది అంచనా. అంతర్జాతీయంగా భారత్‌ ఎకానమీకి వచ్చే కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ప్రస్తుత స్థాయి నిల్వలు దోహదపడతాయని ఇటీవలి  ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బీఐ  విశ్లేషించిన సంగతి తెలిసిందే. కాగా, భారీగా ఉన్న ఫారెక్స్‌ నిల్వలను దేశ మౌలిక రంగ పురోగతికి వినియోగించడానికి వీలయిన విధానాన్ని రూపొందించాలని కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ కొద్ది రోజుల క్రితం సూచించడం మరో విశేషం. ఈ విషయంలో ఆర్‌బీఐ గవర్నర్‌తో చర్చిస్తానని కూడా ఆయన సీఐఐ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ మౌలిక రంగం పురోగతికి తక్కువ రుణ రేటుకు నిధులు కావాలని ఆయన పేర్కొంటున్నారు. తాజా ఫారెక్స్‌  గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే..
► మొత్తం నిల్వల్లో డాలర్ల రూపంలో చూస్తే ప్రధానమైన ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ (ఎఫ్‌సీఏ) విలువ తాజా సమీక్షా వారంలో 1.508 బిలియన్‌ డాలర్లు పెరిగి 577.732 బిలియన్‌ డాలర్లకు చేరింది.  
► పసిడి నిల్వలు 588 మిలియన్‌ డాలర్లు తగ్గి 37.057 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్స్‌ రైట్స్‌ విలువ కూడా ఒక మిలియన్‌ డాలర్లు తగ్గి 1.551 డాలర్లకు
దిగివచ్చింది.  
► ఇక ఐఎంఎఫ్‌ వద్ద రిజరŠవ్స్‌ పరిమాణం కూడా 31 మిలియన్‌ డాలర్లు తగ్గి,  5.125 బిలియన్‌ డాలర్లకు పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement