న్యూఢిల్లీ: శరవేగంగా మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తున్నందున 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఇప్పుడు మనల్ని మనం అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకుంటున్నాము. అభివృద్ధి చెందిన దేశం అవుతుంది.’’ అని కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అన్నారు.
భారతదేశం తన మౌలిక సదుపాయాలను శరవేగంగా ఆధునీకరిస్తున్నదని ఉద్ఘాటించిన ఆయన, ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడవు 3,106 కిలోమీటర్లని ఇది మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పుడు 2014లో కేవలం 353 కిలోమీటర్లేనని పేర్కొన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పురోగతి చాలా కీలకమైనదని, 2014 నుండి ఈ ప్రయోజనం కోసం మూలధన వ్యయం దాదాపు ఐదు రెట్లు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజిన్ లేని సెమీ హై స్పీడ్ రైలు– వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను రోల్ అవుట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మూలధన వ్యయాల పెంపు..
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత, మూలధన వ్యయాల పెంపు గణనీయంగా పెరిగిందన్నారు. 2021–22లో ఈ వ్యవయాలు 5.5 లక్షల కోట్లయితే, 2022–23లో రూ.7.5 లక్షల కోట్లకు, 2023–24లో రూ.10 లక్షల కోట్లకు ఎగసినట్లు మంత్రి వివరించారు.
విద్యుత్ రంగం పురోగతి
దేశం గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 223 జీడబ్ల్యూకు చేరుకుందని పేర్కొన్న మంత్రి, 50జీడబ్ల్యూ సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్య స్థాపనలో ఉందని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనంపై ఆయన మాట్లాడుతూ, భారతదేశం సంవత్సరానికి 50జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని, 2030 నాటికి 500 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
రైల్వే రంగం స్పీడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రైల్వే...కాశ్మీర్ లోయతో అనుసంధానమవుతుందని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి 2004లో ప్రారంభించిన ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతుందని తెలిపారు. 2013–14లో 1,058 మిలియన్ టన్నుల (ఎంటీ)లతో పోలిస్తే, 2022– 23లో అత్యధికంగా 1,512 మిలియన్ టన్నుల (150 శాతం) సరుకు రవాణా జరిగిందని పేర్కొన్నారు. 2030–31 నాటికి సరుకు రవాణాను రెట్టింపు చేసే సామర్థ్యాన్ని సృష్టించేందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 91 శాతం బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ ను విద్యుదీకరించడం జరిగిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాడ్ గేజ్‌ను 100 శాతం విద్యుదీకరించడం జరుగుతుందని మంత్రి ఉద్ఘాటించారు.
3వ అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్...
అమెరికా, చైనా తర్వాత భారతదేశం 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఉందని వివరించారు. 2014లో 74 ఉన్న ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య 2023 నాటికి 148కి రెట్టింపు అయ్యిందని మంత్రి తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లీట్ పరిమాణం 2014లో 395 నుంచి 2023లో 729కి పెరిగిందని వివరించారు. దేశీయ ప్రయాణీకుల సంఖ్య 2013–14లో 61 మిలియన్లు ఉంటే, 2022–23 నాటికి 136 మిలియన్లకు రెండింతలు పెరిగింది. ఇక అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 2013–14లో 43 మిలియన్లు ఉంటే, 2022–23లో 54 మిలియన్‌లకు చేరినట్లు వివరించారు. ఉడాన్ పథకం కింద ఇప్పటివరకు 479 రూట్‌లు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
మొబైల్స్ విప్లవం
మొబైల్ ఫోన్ చందాదారుల సంఖ్య 2014లో 90.45 కోట్లు ఉంటే, 2023 నాటికి 114.4 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. ఈ కాలంలో దాదాపు 24 కోట్ల మంది కొత్త చందాదారులు చేరినట్లు వివరించారు. మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ చందాదారుల సంఖ్య ఇదే కాలంలో 4.56 కోట్ల నుంచి 81.19 కోట్లకు చేరినట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment