న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులలో ఎక్కువ మంది రాబోయే ఒక సంవత్సరంలో తమ ఆర్థిక పరిస్థితి పట్ల ఎంతో ఆశావహంగా ఉన్నారని లండన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వృత్తిపరమైన బహుళజాతి సేవల నెట్‌వర్క్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) పేర్కొంది. అయితే పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఇది వారి కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని నివేదిక తెలిపింది. దేశంలోని పొదుపుల్లో 80 శాతం పెరుగుతున్న జీవన వ్యయాలను, ఇందుకు సంబంధించి అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవేనని విశ్లేషించింది. దేశానికి సంబంధించి విడుదలైన ఈవై ఫ్యూచర్ కన్సూ్యమర్ ఇండెక్స్ తొమ్మిదవ ఎడిషన్ వివరాలు క్లుప్తంగా...
► సర్వే ప్రకారం దేశంలోని 77 శాతం మంది వచ్చే ఏడాది కాలానికి సంబంధించి ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పులను ఆశిస్తున్నారు. దీనిపై ఈ అంశంపై సూచీ భారతీయ వినియోగదారు ల ‘సానుకూల దృక్పథాన్ని‘ పునరుద్ఘాటించిం ది. అంతర్జాతీయంగా నమోదయిన 48 శాతం రేటుకన్నా ఇది మెరుగ్గా ఉండడం గమనార్హం.
►దేశంలో వినియోగదారులకు వస్తువులు, సేవల ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఇది వస్తువులను కొనుగోలు చేసే వారి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వారి కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.
►వినియోగానికి సంబంధించి ‘‘తమ స్థోమత’’ను బట్టే ప్రధానంగా వ్యయాలు ఉంటాయని వర్థమాన దేశాల్లో 62 శాతం మంది పేర్కొంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రేటు 45 శాతంగా ఉంది. దేశాల వారీగా చూస్తే, ఈ గణాంకాలు భారత్ దేశంలో 64 శాతం, దక్షిణాఫ్రికాలో 77 శాతం, బ్రెజిల్‌లో 63 శాతం, చైనాలో 42 శాతం ఉన్నాయి. ఇక అభివృద్ధి చెందిన మార్కెట్లను చూస్తే ఈ రేట్లు అమెరికాలో 50 శాతం, కెనడాలో 52 శాతం, బ్రిటన్‌లో 42 శాతం, ఫ్రాన్స్ 40 శాతాలుగా ఉన్నాయి.
►స్థోమతను బట్టి వ్యయాలు ఉంటాయన్న వారిని భారత్‌లో గ్రూపులుగా విభజిస్తే, తక్కువ ఆదాయ సంపాదకుల విషయంలో ఇది 72 శాతంగా ఉంది. అధిక ఆదాయ సమూహానికి సంబంధించి 60 శాతం, మధ్య ఆదాయ వర్గానికి సంబంధించి 58 శాతంగా ఉంది.
► దేశంలోని పొదుపుల్లో 80 శాతం పెరుగుతున్న జీవన వ్యయాలను, ఇందుకు సంబంధించి అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవే. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది ఇప్పటికే ఖర్చు చేయడం కంటే పొదుపు చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు.
►భారత్ వినియోగదారులో వ్యయాలు ఆరోగ్యం కేంద్ర బిందువుగా కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిడి మధ్య కూడా భారతీయ వినియోగదారులు అధిక నాణ్యత, సేంద్రీయ ఆహారం కోసం అధిక డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.
►భారతదేశంలో సర్వేలో పాల్గొన వారిలో సగానికి పైగా (54 శాతం) వ్యక్తులు వచ్చే 2–3 సంవత్సరాలలో శారీరక ఆరోగ్యం, ఆరోగ్య పరిరక్షణనే లక్ష్యంగా చేసుకున్నారు. 80 శాతం మంది దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారిస్తున్నారు. మానసిక ఆరోగ్యం ఆవసరమని, దీనిపై తాము దృష్టి పెడుతున్నామని చెప్పిన వారి సంఖ్య 78 శాతంగా ఉంది.వినియోగదారుల్లో ఈ తరహా వైఖరి దీర్ఘకాలంలో కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.
►వినియోగదారుల్లో పర్యావరణ స్పృహ కూడా గణనీయంగా పెరుగుతోంది.
► దీనితోపాటు బ్రాండ్ల పట్ల అవగాహనా విస్తృతమవుతోంది. వారికి విక్రయించే బ్రాండ్‌ల విలువలను తెలుసుకోవడానికి భారత్ వినియోగదారులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
ఉత్పత్తి సంస్థలకు సవాళ్లు..
మహమ్మారి తదితర అనిశ్చితి పరిస్థితుల నుంచి చవిచూసిన అనుభవాలు, ద్రవ్యోల్బణం స్పీడ్ వంటి పలు అంశాలు వినియోగదారును ప్రస్తుతం గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆయా అంశాలు వ్యయాల నుంచి వారిని వెనక్కు మళ్లేలా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి సంస్థలు సైతం సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రత్యేకించి నిత్యావసరాలకు సంబంధించి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు తమ ఆదాయాన్ని– మార్జిన్‌లను బేరీజు వేసుకుని కార్యకలాపాలు నిర్వహించాలి. లాభదాయకతను పెంచడానికి వ్యయాలనూ కట్టడి చేయాలి ఉంటుంది. విలువ గొలుసు అంతటా ఖర్చులను తగ్గించాలని పిలుస్తుంది‘ అని ఇది పేర్కొంది. మహమ్మారి తర్వాత వినియోగదారుల ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్న విషయాన్ని జాగ్రత్తగా గమనించిన నిర్ణయాలు తీసుకోవాలి.
– అంగ్షుమన్ భట్టాచార్య, ఈవై ఇండియా పార్టనర్ అండ్ నేషనల్ లీడర్ (కన్సూ్యమర్ ప్రొడక్ట్, రిటైల్ సెక్టార్)
సర్వేకు ప్రాతిపదిక ఇదీ..
2022 ఫిబ్రవరిలో 1,000 మంది భారతీయ వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఈవై ఫ్యూచర్ కన్సూ్యమర్ సూచీకి ప్రాతిపదిక. ఈ ఇండెక్స్ నిర్ధిష్ట కాలపరిధిలో ప్రపంచ మార్కెట్‌లలో మారుతున్న వినియోగదారు సెంటిమెంట్, వారి కొనుగోలు ప్రవర్తనలను ట్రాక్ చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న కొత్త వినియోగదారు అభిరుచులను గుర్తిస్తుంది. భారత్‌సహా అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, ఇండోనేషియా, ఇటలీ, స్పెయిన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, చిలీ (కొత్త), అర్జెంటీనా (కొత్తది), థాయిలాండ్ (కొత్తది)లలో ఈ ఏడాడి జనవరి 28 నుంచి ఫిబ్రవరి 15, 2022 మధ్య 18,000 వినియోగదారులతో జరిపిన అభిప్రాయ సేకరణ ప్రాతిపదికన ఈవై ఫ్యూచర్ కన్సూ్యమర్ ఇండెక్స్ తొమ్మిదో ఎడిషన్ రూపొందింది.
Comments
Please login to add a commentAdd a comment