సాక్షి,ముంబై: కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) భారత్ ఎకానమీ వృద్ధి తొలి అంచనాలను తగ్గిస్తున్న ఆర్థిక విశ్లేషణ, రేటింగ్ సంస్థల వరుసలో తాజాగా బ్రిక్‌వర్క్ రేటింగ్స్ చేరింది. క్రితం 11 శాతం అంచనాలను 9 శాతానికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో పేర్కొంది. తొమ్మిది శాతం కూడా లోబేస్ వల్లే 2020-21లో అతి తక్కువ గణాకాల నమోదు) సాధ్యమవుతోందని తెలిపింది.
వ్యాక్సినేషన్ విస్తృతమై, కరోనా కట్టడి జరిగే వరకూ సరఫరాల్లో ఇబ్బందులు, కార్మికుల కొరత, డిమాండ్ తగ్గుదల వంటి సవాళ్లు కొనసాగుతాయని తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లు భారత్ ఎకానమీ రికవరీ ప్రక్రియను పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిపింది. అయితే వ్యవసాయ రంగంపై మహమ్మారి ప్రతికూల సవాళ్లు అంతగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఈ రంగం 2021-22లో 3.5 శాతం వృద్ధిని నమోదుచేసుకోవచ్చని అంచనావేసింది. పారిశ్రామిక రంగం వృద్ధి అంచనాలను 11.5 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. సేవల రంగం వృద్ధి అంచనాలను 11.8 శాతం నుంచి 9.6 శాతానికి తగ్గించింది. భారత్ తొలి వృద్ధి అంచనాలు ఇప్పటికే ఇక్రా (10.5 శాతం నుంచి 11 శాతానికి) కేర్ (10.2 శాతంనుంచి 10.7 శాతానికి) ఇండ్-రా (10.1 శాతం నుంచి 10.4 శాతానికి) ఎస్‌బీఐ రిసెర్చ్ (10.4 శాతం నుంచి 11 శాతానికి) ఆక్ట్‌ఫర్డ్ ఎకానమీస్ (11.8 శాతం నుంచి 10.2 శాతానికి) తగ్గించాయి.
Comments
Please login to add a commentAdd a comment