ముంబై: భారత్ స్టాక్ మార్కెట్లో మళ్లీ బుల్ రంకెలేసింది. అంతర్జాతీయ మార్కెట్ల అండతో దేశీయ మార్కెట్... విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో దూసుకెళ్లింది. పెరుగుతున్న కరోనా కేసులు, ద్రవ్యోల్బణ ఆందోళనలు పరుగును ఆపలేకపోయాయి. అమెరికాలోని హెడ్జ్ ఫండ్ డిఫాల్ట్‌తో తడబడలేదు. ప్రపంచవ్యాప్తంగా పుంజుకుంటున్న బాండ్ ఈల్డ్స్ భయాలను బేఖాతరు చేసింది. కరిగిపోయిన రూపాయితోనూ కలవరపడలేదు. వెరసి రెండు వారాల గరిష్టస్థాయి వద్ద స్థిరపడింది. ఆర్థిక, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 1,128 పాయింట్లు లాభపడి 50,137 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పెరిగి 14,845 వద్ద నిలిచింది. గడిచిన రెండు నెలల్లో ఇరు సూచీలకూ అత్యధిక లాభాలు ఇవే కావడం విశేషం.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండు నెలల కనిష్టానికి పతనం కావడంతో ఐటీ, ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఏడాది స్థాయికి చేరుకోవడంతో మెటల్ షేర్లు మెరిశాయి. కిందటి వారంలో నష్టాలను చవిచూసిన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. అయితే రియల్టీ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 1260 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 369 పాయింట్లను ఆర్జించగలిగింది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు, నిఫ్టీ ఇండెక్స్‌లోని 50 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి.
‘‘రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రారంభంతో పాటు కార్పొరేట్ కంపెనీ క్యూ4 ఫలితాల విడుదల నేపథ్యంలో రిటైల్ కొత్త ఇన్వెస్టర్లు, అధిక సంఖ్యలో కొనుగోళ్లను చేపట్టి ఉండొచ్చు. నిఫ్టీ చివరి ట్రేడింగ్ సెషన్‌లో కీలకమైన 14,500 మద్దతు స్థాయిని ఛేదించగలగడం కూడా సాంకేతికంగా కలిసొచ్చింది. ఇప్పటికీ మార్కెట్ అంతర్గతంగా బలహీనంగా ఉంది. ట్రేడర్లు అప్రమత్తత వహించాలి’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ మోదీ అభిప్రాయపడ్డారు.
ఆరంభం నుంచి దూకుడుగానే ...
మూడురోజుల విరామం తర్వాత దేశీయ మార్కెట్ లాభాలతో మొదలైంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు సూచీల గ్యాపప్ ప్రారంభానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ 323 పాయింట్ల లాభంతో 49,331 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 14,628 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనసాగిన పర్వంతో సూచీలు దూసుకెళ్లాయి. మిడ్ సెషన్‌లో కాస్త వెనక్కి తగ్గినా.., యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,260 పాయింట్లు లాభపడి 50,268 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లను ఆర్జించి 14,876 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్, ఇంధన షేర్లు జోరుతో సూచీలు ఈ స్థాయిలో లాభాలను మూటగట్టుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
►ఎన్‌హెచ్‌ఏఐ నుంచి భారీ కాంట్రాక్టు దక్కించుకోవడంతో దిలీప్ బిల్డ్‌కాన్ 5% లాభంతో రూ.586 వద్ద ముగిసింది.
►బోనస్ ఇష్యూను పరిగణనలోకి తీసుకోవడంతో ఇక్రాన్ ఇంటర్నేషనల్ షేరు ఎనిమిది శాతం లాభంతో రూ.87 వద్ద స్థిరపడింది.
►అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడైన యస్ బ్యాంక్ షేరు చివరికి 17% లాభంతో రూ.16 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment