జైపూర్: కేంద్రం చేపట్టిన సంస్కరణ చర్యలు ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు భారతదేశాన్ని ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా చూస్తోందని తెలిపారు. ఉజ్వల, జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాలను దేశంలోని నలుమూలలా ఎలాంటి తారతమ్యం లేకుండా అమలు చేస్తున్నట్లు వివరించారు.
ద్రవ్యోల్బణ రేటు ‘సింగిల్ డిజిట్’కు పరిమితం అయ్యేలా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ‘‘ప్రభుత్వ చర్యలు దేశంలో ఆర్థిక వృద్ధిని పెంచడానికి, యువతకు ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో బలహీనంగా ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే పటిష్టవంతమైన ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది’’అని ఆయన ఇక్కడ విలేకరులతో అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
♦ పెట్టుబడులకు సంబంధించి భారతదేశాన్ని ప్రపంచం ప్రధాన ఆర్థిక గమ్యస్థానంగా చూస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో కూడా సహాయపడుతోంది.
♦ దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా ఉన్నాయి. దాదాపు 10 నెలల దిగుమతులకు ఈ నిల్వలు సరిపోతాయి.
♦ కీలకమైన ఖనిజ రంగంలో సహకారాన్ని పెంచుకోవడం కోసం అమెరికా, కెనడా వంటి దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది.
జమ్మూ కశ్మీర్‌లో లిథియం నిల్వలు...
జమ్మూ కశ్మీర్‌లో లిథియం నిల్వల గురించి అడిగినప్పుడు ఆయన సమాధానం చెబుతూ, గనులు, ఖనిజ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దానిని ధృవీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ క్లిష్టమైన ఖనిజాన్ని వెలికితీసేందుకు భారతదేశానికి సాంకేతికత అవసరమని ఆయన అన్నారు.
లిథియం నాన్–ఫెర్రస్ మెటల్. ఎల్రక్టానిక్ వెహికిల్స్ (ఈవీ) బ్యాటరీలలో కీలకమైన భాగాలలో ఇది ఒకటి. ప్రస్తుతం లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి అనేక ఖనిజాల కోసం భారతదేశం దిగుమతిపై ఆధారపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment