న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండు విమానయాన సేవల దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 1,423 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 130 కోట్లు ఆర్జించింది. విదేశీమారక నష్టాలను మినహాయిస్తే రూ. 2,009 కోట్ల లాభం సాధించినట్లు కంపెనీ పేర్కొంది. విమానయానానికి ఊపందుకున్న డిమాండ్ ఇందుకు దోహదపడినట్లు కంపెనీ సీఈవో పీటర్ ఎల్బెర్స్ తెలియజేశారు. మొత్తం ఆదాయం సైతం రూ. 9,480 కోట్ల నుంచి రూ. 15,410 కోట్లకు ఎగసింది.
ఒక క్వార్టర్‌కు ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని పీటర్ పేర్కొన్నారు. కంపెనీలో తీసుకున్న పలు చర్యలు ఫలితాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రయాణాలకు పెరిగిన డిమాండును ప్రతిఫలిస్తూ 26 శాతం అధికంగా 2.23 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. సీట్ల ఆక్యుపెన్సీ 79.7 శాతం నుంచి 85.1 శాతానికి పుంజుకుంది. 300 ఆధునిక విమానాలతో సర్వీసులందిస్తున్నట్లు తెలియజేశారు. డీజీసీఏ గణాంకాల ప్రకారం దేశీయంగా 55.7 శాతం మారెŠక్ట్ వాటా కలిగి ఉన్నట్లు ప్రస్తావించారు. కంపెనీ రూ. 10,612 కోట్లు చేతిలో నగదుసహా రూ. 21,925 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది. ఇదే సమయంలో రూ. 41,042 కోట్ల లీజ్ లయబిలిటీలతో కలిపి రూ. 44,475 కోట్ల రుణాలున్నాయి.
ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్‌ఈలో 1.2 శాతం నష్టంతో రూ. 2,100 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment