నేను ఆదాయపన్ను 30 శాతం శ్లాబు పరిధిలోకి వస్తాను. దీంతో అత్యవసర నిధిని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – సిర్ముఖుద్దమ్
మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను పరంగా ప్రయోజనానికి తోడు మెరుగైన రాబడులకు మార్గం అవుతుంది. అత్యవసర నిధి ఎప్పుడూ మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగానూ అనుకూలంగా ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ అయితే ఏటేటా వడ్డీ ఆదాయం పన్ను చెల్లింపుదారు ఆదాయానికి కలుస్తుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను ఆధారపడి ఉంటుంది. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారు ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపైనా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అదే డెట్ ఫండ్ అయితే పెట్టుబడి మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటే లాభంపై 20 శాతం పన్ను పడుతుంది. ద్రవ్యోల్బణ తరుగు ప్రభావం మినహాయించిన తర్వాత మిగిలిన లాభంపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ డెట్ ఫండ్‌లో పెట్టుబడిని మూడేళ్లలోపు ఉపసంహరించుకుంటే అప్పుడు లాభం ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరే ఆదాయానికి కలుస్తుంది. అయితే, ఎఫ్‌డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులను ఇస్తాయి. కానీ, డెట్ ఫండ్స్‌లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్‌డ్ డిపాజిట్స్ మాదిరి పెట్టుబడులకు రక్షణ హామీ కూడా ఉండదు. అయినా కానీ, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి. కాకపోతే, నాణ్యమైన డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసిన పథకాన్నే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది.
నాకు ఎన్‌పీఎస్ పథకంలో టైర్ 1, టైర్ 2 ఖాతాలున్నాయి. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఉన్నాయి. ప్రస్తుత వడ్డీ రేట్ల పెరుగుదల పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్ బాండ్స్‌లో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్
గిల్ట్ ఫండ్స్ లేదా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల్లో అస్థిరతలు.. షార్ట్ డ్యురేషన్ లేదా కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌తో పోలిస్తే సహజంగా ఎక్కువ. ఎందుకంటే గిల్ట్ ఫండ్స్ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్ రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. వడ్డీరేట్లు పెరుగుతున్నాయి కనుక, స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి. అందుకని సమీప కాలానికి ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు సైతం అంత చక్కని ప్రదర్శన ఇవ్వవు. అయితే, ఈ అస్థిరతలు ఎప్పుడూ కూడా స్వల్పకాలంలోనే. దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో చూసుకుంటే గిల్ట్ ఫండ్స్‌లో రాబడులు ఏమీ లేవని చెప్పుకోవాలి. కానీ మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మాదిరే గిల్ట్ ఫండ్స్ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్‌పీఎస్ టైర్ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్‌కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. కనుక పెట్టుబడులపై, రాబడులపై అంత ప్రతికూల ప్రభావం ఏమీ ఉండదు. ప్రస్తుత వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను మీరు తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో మీరు యాక్టివ్‌గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నారు. కనుక కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది.
- ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్)
Comments
Please login to add a commentAdd a comment