
న్యూఢిల్లీ: ఫార్మా రంగానికి ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద రూ. 25,813 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా 56,171 ఉద్యోగాల కల్పన జరిగింది. కేంద్ర ఫార్మా విభాగం (డీవోపీ) వార్షిక సమీక్షలో ఈ విషయాలు వెల్లడించింది. స్కీముకు ఎంపికైన సంస్థలు రూ. 1,16,121 కోట్ల మేర విక్రయించినట్లు డీవోపీ తెలిపింది.
దేశీయంగా ఔషధాల తయారీని మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మా పీఎల్‌ఐ స్కీము ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2020–2021 నుంచి 2028–2029 మధ్య కాలంలో ఇది అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద 55 సంస్థల దరఖాస్తులు ఆమోదం పొందాయి.
నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరలో అందించేందుకు తలపెట్టిన ’ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన’ కింద ఈ ఏడాది 10,000 రిటైల్ అవుట్‌లెట్స్ ప్రారంభించాలన్న లక్ష్యం కూడా డీవోపీ పూర్తయినట్లు పేర్కొంది. పీఎంబీజేపీ కింద 1,965 ఔషధాలు, 293 సర్జికల్ పరికరాలు ఉన్నాయి.