రాబడి కోసం కొత్త మార్గం..! | Invoice Discounting Investment explanation special story | Sakshi
Sakshi News home page

రాబడి కోసం కొత్త మార్గం..!

Published Mon, Aug 22 2022 12:54 AM | Last Updated on Mon, Aug 22 2022 12:54 AM

Invoice Discounting Investment explanation special story - Sakshi

కొందరు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడి సాధనాల కోసం తరచూ అన్వేషిస్తుంటారు. పెట్టుబడుల్లో ఎక్కువ వైవిధ్యం కోరుకుంటారు. కొందరికి రాబడే ప్రామాణికం. రిస్క్‌ ఉన్నా ఫర్వాలేదు ఎక్కువ రాబడి కావాలన్నది వారి విధానం. ముఖ్యంగా నేటి తరం యువ ఇన్వెస్టర్లు స్థిరమైన ఆదాయం కోసం డెట్‌కు ప్రత్యామ్నాయ సాధనాల కోసం చూస్తున్నారు.

సంప్రదాయ డెట్‌ సాధనాలతో పోలిస్తే వారికి ఎక్కువ రాబడి కావాలి. ఈక్విటీ మార్కెట్లలో మాదిరిగా అస్థిరతలు ఉండకూడదు. ఎలానూ ఈక్విటీల్లో కొంత ఇన్వెస్ట్‌ చేస్తారు. కనుక ప్రత్యామ్నాయాలు కోరుకునే వారు పెరిగిపోతున్నారు. ఈ తరహా ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చిన సాధనమే ‘ఇన్‌వాయిస్‌ ఇన్వెస్టింగ్‌’. ఇది ఎలా పనిచేస్తుంది? రాబడులు ఏ మేరకు ఉంటాయి? తదితర వివరాలను అందించే ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం ఇది..

ఇన్‌వాయిస్‌ ఫైనాన్స్‌ / డిస్కౌంటింగ్‌ అంటే...
ఇన్‌వాయిస్‌ ఫైనాన్స్, డిస్కౌంటింగ్‌ను సులభంగా అర్థం చేసుకుందాం. ఒక పేపర్‌ తయారీ కంపెనీ ఉంది. రూ.లక్ష విలువ చేసే పేపర్‌ను నోట్‌బుక్‌ తయారీ కంపెనీకి విక్రయించింది. ఒప్పందం ప్రకారం 90 రోజుల తర్వాత రూ.లక్షను నోట్‌బుక్‌ తయారీ కంపెనీ చెల్లిస్తే చాలు. కానీ, అంతకంటే ముందే నిధుల అవసరం పేపర్‌ కంపెనీకి ఏర్పడింది. దీంతో నోట్‌బుక్‌ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్‌వాయిస్‌ను రూ.90వేలకే ఒక ప్లాట్‌ఫామ్‌లో విక్రయానికి ఉంచింది. దీన్ని ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌ అంటారు.

ఈ డీల్‌లో పేపర్‌ కంపెనీకి వెంటనే రూ.90వేల క్యాష్‌ ఫ్లో అందుతుంది. దీన్ని కొనుగోలు చేసిన ఇన్వెస్టర్‌కు 90 రోజులకే రూ.10వేల లాభం వస్తుంది. అలా కాకుండా.. ఇదే పేపర్‌ తయారీ కంపెనీ నోట్‌ బుక్‌ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్‌వాయిస్‌ను వెంటనే నగదుగా మార్చుకోవాలని అనుకుంది. డిస్కౌంట్‌కు విక్రయించకుండా, 90 రోజుల కాలానికి 12 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తూ రూ.లక్ష రుణం కోరింది. దీన్ని ఇన్‌వాయిస్‌ ఫైనాన్సింగ్‌ అంటారు.   

ఎలా పనిచేస్తుంది..?
ఇది స్టార్టప్‌ల కాలం. ఏటేటా వందలాది స్టార్టప్‌లు ఉనికిలోకి వస్తున్నాయి. వీటి విస్తరణకు నిధులు అవసరం ఎంతో ఉంటుంది. అదే సమయంలో అవి నిధుల కోసం ప్రతిసారి ఈక్విటీ జారీ మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఈక్విటీ  విలువ పలుచబడిపోతుంది. దీనివల్ల రాబడులూ పలుచన అవుతాయి. ఇక్కడే రెవెన్యూ బేస్డ్‌ ఫైనాన్సింగ్‌ (కంపెనీల ఆదాయాన్ని చూసి రుణాలు ఇవ్వడం) అవసరం ఎదురవుతుంది. ఇది అటు స్టార్టప్‌లకు, ఇటు పెట్టుబడి అందించే వారికీ ప్రయోజనం చేకూరుస్తుంది. కంపెనీలకు తలనొప్పి లేని నిధులు అందుతాయి. జిరాఫ్, బెటర్‌ఇన్వెస్ట్, క్రెడ్‌ఎక్స్‌ ఇలా పలు సంస్థలు ఇన్వెస్టింగ్‌ ఫైనాన్సింగ్‌కు సంబంధించి మంచి పెట్టుబడుల అవకాశాలను ఆఫర్‌ చేస్తుంటాయి.

వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ), ఏంజెల్‌ ఇన్వెస్టర్లు ఉన్నారు కదా? అన్న ప్రశ్న ఎదురుకావచ్చు. కానీ, ఇవి ఊరికే పెట్టుబడులు అందించవు. భారీ రాబడులు ఆశిస్తాయి. లేదంటే తాము అందించే పెట్టుబడులకు భారీ వాటా కోరుకుంటుంటాయి. రిస్క్‌ ఎక్కువగా ఉండే వ్యాపారాలకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి నిధులు లభించడం అసాధ్యం. అందుకనే ఆదాయం చూసి రుణాలు అందించే ఆర్‌బీఎఫ్‌ మార్కెట్‌ విస్తరిస్తోంది. ఈ విభాగంలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు ‘ఇన్‌వాయిస్‌ ఫైనాన్స్‌/ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌’ రూపంలో పెట్టుబడుల అవకాశాలు లభిస్తాయి. ఇన్‌వాయిస్‌ల రూపంలో కంపెనీలు తమకు కావాల్సిన నిధులను సమకూర్చుకుంటాయి. ఇన్‌వాయిస్‌లపై కంపెనీలకు నిధులు రావాల్సి ఉన్నప్పుడు.. వాటిని ఇన్వెస్టర్లకు హామీగా ఉంచి/లేదా విక్రయించి కంపెనీలు నిధులు కోరతాయి.  

సౌకర్యవంతం...
 ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. వారికి భిన్నమైన పెట్టుబడుల అవకాశాలను అందించేందుకు ఎన్నో ఆన్‌లైన్‌ వేదికలు కూడా ఏర్పాటువుతున్నాయి. అలా వచ్చిందే ఇన్‌వాయిస్‌ ఇన్వెస్టింగ్‌. 18 ఏళ్లు నిండి, కేవైసీ పూర్తి చేసిన వారు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి లక్ష రూపాయిల నుంచి మొదలవుతుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు, కొన్ని కేసుల్లో కనీసం రూ.3 లక్షలు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. తమ ప్లాట్‌ఫామ్‌పై నమోదైన ఇన్వెస్టర్లకు ఆయా సంస్థలు పెట్టుబడుల అవకాశాలను తీసుకొస్తుంటాయి.

ఇందుకోసం ఇన్వెస్టర్, రుణ గ్రహీత ఇద్దరి నుంచి ‘స్ప్రెడ్‌ (వడ్డీ రేటు మధ్య వ్యత్యాసం) రూపంలో చార్జీలను వసూలు చేస్తాయి. పెట్టుబడుల అవకాశాలను లిస్టింగ్‌ చేసేందుకు కూడా చార్జీ తీసుకుంటాయి. రుణం కోసం కంపెనీలు ఆఫర్‌ చేసే ఇన్‌వాయిస్‌లను ఆయా ప్లాట్‌ఫామ్‌లు ముందుగా తనిఖీ చేస్తాయి. అవి నిజమైనవా, కావా అన్నది నిర్ధారించుకుంటాయి. అంతా డీజిటల్‌గా జరిగిపోయే విధానం కావడంతో ఇరువైపుల వారికి సౌకర్యంగా ఉంటుంది. పైగా అందుబాటు ధరలకే నిధులు కంపెనీలకు లభిస్తాయి. ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు అందుతాయి. కొత్తవారు, అనుభవం లేని వారు అయితే తెలిసిన ఇన్వెస్టర్‌తో సంయుక్తంగా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.  

పెట్టుబడుల అవకాశాలు
జిరాఫ్‌ ప్లాట్‌ఫామ్‌.. ఏడేళ్ల చరిత్ర కలిగిన లాజిస్టిక్స్‌ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌ డీల్‌ ను అందిస్తోంది. కాలవ్యవధి కేవలం 91 రోజులు. దీని ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ (ఐఆర్‌ఆర్‌) 12.25 శాతంగా ఉంది. అంటే రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేస్తే మూడు నెలల్లో రూ.1.03 వేలు లభిస్తాయి. జిరాఫ్‌ డీల్‌ను లిస్ట్‌ చేయడానికే పరిమితం కాదు. సదరు పెట్టుబడిని కాల వ్యవధి వరకు పర్యవేక్షిస్తుంటుంది. ఇన్వెస్టర్లకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇస్తుంది.

డిఫాల్ట్‌ అవకాశాలు ఏర్పడితే...
డిఫాల్ట్‌ (ఎగవేత) అవకాశాలు ఉన్నట్టు భావిస్తే ఇన్వెస్టర్ల తరఫున తనే ఆయా హక్కులను వినియోగించుకుని డీల్స్‌ను క్లోజ్‌ చేసి, నిధులు రాబడుతుంది. జిరాఫ్‌ ప్లాట్‌ఫామ్‌పై 30/60 రోజుల కాలవ్యవధితో కూడిన ‘ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌’ డీల్‌ కూడా ఉంది. క్రెడ్‌ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో కనీస పెట్టుబడి రూ.3 లక్షలుగా ఉంది. కాల వ్యవధి 30/90 రోజులు. ఇక బెటర్‌ఇన్వెస్ట్‌ ప్లాట్‌ఫామ్‌ అయితే ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాలను ఆఫర్‌ చేస్తోంది.

సినీ నిర్మాణంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తోంది. సినిమా విడుదలైన 60/90 రోజుల తర్వాత నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సినీ నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తుంది. మరి అప్పటి వరకు వాటికి నిధుల అవసరం ఎంతో ఉంటుంది కదా. అందుకుని సినీ నిర్మాణ సంస్థలు ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి ఇన్‌వాయిస్‌లను ఇన్వెస్టర్లకు విక్రయిస్తుంటాయి. ఇక్కడ ఓటీటీ సంస్థలే నేరుగా ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. వీటి వార్షిక రాబడి 12.18 శాతంగా ఉంది.  ఆయా అంశాలు అన్నింటిపై నిపుణుల సలహాలు అవసరం.  

రిస్క్‌లు  ఏమిటంటే..
ఏ పెట్టుబడిలో అయినా రిస్క్‌ ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌ వేదికలు రాబడి నుంచి పన్ను మేర తగ్గించి ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. ఇక ఇన్వెస్టర్లు తమవైపు నుంచి ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదని అవి చెబుతుంటాయి. కానీ, మిగిలిన ప్లాట్‌ఫామ్‌లకు ఈ విషయంలో స్పష్టత లేదు. కనుక ప్లాట్‌ఫామ్‌లు పన్ను కోత అమలు చేస్తే, ఆ మేరకు టీడీఎస్‌ అడిగి రిటర్నుల్లో చూపించుకోవడం మంచిది. తక్కువ సందర్భాల్లో పెట్టుబడికి కూడా నష్టం ఏర్పడొచ్చు.

కాకపోతే ఆయా పెట్టుబడుల అవకాశాలకు సంబంధించి రిస్క్‌ను తాము ముందే విశ్లేషించినట్టు ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆలస్యం అయినా, ఎగ వేతలు ఏర్పడినా, మోసాలు జరిగినా, తప్పుదోవ పట్టించినా బాధ్యత తీసుకోవు. ఇవి కేవలం ఇరువైపుల వర్గాలను కలిపేందుకు, వారికి సేవలు అందించడానికే పరిమితమవుతుంటాయి. దేనీకి హామీ ఇవ్వవు. కనుక సంప్రదాయ డెట్‌ పెట్టుబడి సాధనాలకు ఇవి ప్రత్యామ్నాయం కావు. పీపీఎఫ్‌లో 7%, ఎఫ్‌డీల్లో 6–7% మేర రాబడి వస్తుంది. కానీ, వాటిల్లో హామీ ఉంటుంది.

ఇన్‌వాయిస్‌ ఇన్వెస్టింగ్‌కు ఇటువంటి హామీ ఉండదు. నిధులు ఆశించే సంస్థల పేరు, బ్రాండింగ్‌ తదితర అంశాల ఆధారంగా రిస్క్‌ను కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఆయా సంస్థలకు సంబంధించి గత చరిత్ర ఆధారంగానూ నిర్ణయం తీసుకోవచ్చు. మార్కెట్‌ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటే రిస్క్‌ ఎదురుకావచ్చు. దీర్ఘకాలానికి ఇన్‌వాయిస్‌లపై రుణాలు తీసుకునే సంస్థల విషయంలో ముందుగానే తగినంత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మూడేళ్లకు పైగా కాలంలో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మారిపోయే రిస్క్‌ ఉంటుంది. మూడు నెలల నుంచి ఏడాదిలోపు ఇన్‌వాయిస్‌లపై రిస్క్‌ తక్కువగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement