ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)ని ఐపీవో నామ సంవత్సరంగా పేర్కొనవచ్చునంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ఏడాది ఇప్పటివరకూ 15 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా రూ. 30,000 కోట్లకుపైగా సమీకరించాయి. 2019లో ప్రైమరీ మార్కెట్ ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న నిధులు రూ. 20,300 కోట్లు. వీటితో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఇప్పటికే 50 శాతానికిపైగా ఫండ్స్‌ను కంపెనీలు సమీకరించగలిగాయి. అంతేకాకుండా 14 కంపెనీలూ ప్రస్తుతం ఐపీవో ధరలతో పోలిస్తే లాభాలతో ట్రేడవుతుండటం విశేషం! వెరసి 2020ను ఐపీవో ఏడాదిగా నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి కోవిడ్-19 సంక్షోభం నుంచి మార్కెట్లు ఫీనిక్స్‌లా పుంజుకోవడం విశేషమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మార్చి కనిష్టాల నుంచి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 79 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. కొత్త సంవత్సరం(2021)లోనూ ప్రైమరీ మార్కెట్ ఇదేవిధంగా కళకళలాడే వీలున్నట్లు కొటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ భావిస్తోంది. ఇందుకు ప్రధానంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనుండటాన్ని ప్రస్తావిస్తోంది. కొత్త ఏడాదిలో ఐపీవోకు రాగల కంపెనీలలో కళ్యాణ్ జ్యువెలర్స్(రూ. 1750 కోట్లు), ఇండిగో పెయింట్స్(రూ. 1,000 కోట్లు), స్టవ్ క్రాఫ్ట్, సంహి హోటల్స్, ఏజీజే సురేంద్ర పార్క్ హోటల్స్, జొమాటో తదితరాలున్నాయి. ఎల్‌ఐసీకాకుండా 30 కంపెనీలు సుమారు రూ. 30,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఎల్‌ఐసీ భారీ ఇష్యూకావడంతో రూ. 50,000 కోట్లకు మించి నిధుల సమీకరణకు వీలున్నట్లు కొటక్ ఇన్వెస్ట్‌మెంట్ అంచనా వేస్తోంది. (వచ్చే వారం మార్కెట్ల పయనమెటు?)
బెక్టర్స్ ఫుడ్ రికార్డ్
ఈ ఏడాది 15వ కంపెనీగా గురువారమే ఐపీవో పూర్తిచేసుకున్న బెర్టర్స్ ఫుడ్ గత ఐదేళ్లలోలేని విధంగా 198 రెట్లు అధిక బిడ్స్‌ను పొందింది. ఇంతక్రితం 2018లో అపోలో మైక్రోసిస్టమ్స్ మాత్రమే ఇంతకంటే అధికంగా 248 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. వెరసి బెక్టర్స్ ఫుడ్ రెండో ర్యాంకులో నిలిచింది. ఇక ట్రేడింగ్ ప్రారంభం రోజు లాభాలకు వస్తే.. కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ రెట్టింపునకుపైగా లాభంతో రూ. 731 వద్ద లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 340 మాత్రమే. ఇదేవిధంగా హ్యాపియెస్ట్ మైండ్స్ ఐపీవో ధర రూ. 166కాగా.. రూ. 351 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ బాటలో రూ. 350 ధరలో ఐపీవోకు వచ్చిన రూట్ మొబైల్ రూ. 708 వద్ద లిస్టయ్యింది. బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 60కాగా.. 115 వద్ద లిస్టయ్యింది. రోజారీ బయోటెక్ ఐపీవో ధర రూ. 425తో పోలిస్తే రూ. 670 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. కాగా.. ఈ ఏడాది 16వ కంపెనీగా వచ్చే వారం నుంచీ ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ)
వెనకడుగులో
ఈ ఏడాది ఐపీవోకు వచ్చిన కంపెనీలలో ఇష్యూ ధర కంటే దిగువన లిస్టయిన కంపెనీల జాబితా చూస్తే.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఏంజెల్ బ్రోకింగ్, ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ చోటు చేసుకున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ లాభాల బాట పట్టడం గమనార్హం. ఇక ఐపీవో ధరను మించి లాభాలతో లిస్టయిన కంపెనీలలో బర్గర్ కింగ్, గ్లాండ్ ఫార్మా, లిఖిత ఫైనాన్స్, మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్, కెమ్‌కాన్ స్పెషాలిటీ, రూట్ మొబైల్, హ్యాపియెస్ట్ మైండ్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, రోజారీ బయోటెక్ నిలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment