న్యూఢిల్లీ: టెక్నాలజీ వేగవంతంగా మారిపోతున్న నేపథ్యంలో దేశీయంగా ఐటీ సర్వీసుల విభాగంలో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో నియామకాలు 10–12 శాతం వరకు పెరగనున్నాయి. జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన కొత్త టెక్నాలజీలతో 2030 నాటికి పది లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది.
బిజినెస్ సర్వీసుల సంస్థ క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో క్వెస్ ఐటీ స్టాఫింగ్ విభాగం కార్యకలాపాల ఆధారంగా దీన్ని రూపొందించారు. టెక్ నియామకాలకు నెలకొన్న డిమాండ్, మార్కెట్‌లో పరిస్థితుల గురించి సంస్థలకు అవగాహన కల్పించే విధంగా గణాంకాలను ఇందులో విశ్లేషించారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), సైబర్‌సెక్యూరిటీ విభాగాల్లో రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) నిపుణులైన సిబ్బందికి డిమాండ్ గణనీయంగా పెరిగింది.
సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్రితం త్రైమాసికంతో పోలిస్తే జీసీసీలో 71 శాతం, సైబర్‌సెక్యూరిటీలో 58 శాతం మేర ఉద్యోగావకాశాలు పెరిగాయి. పుష్కలంగా టెక్ నిపుణుల లభ్యత, వినూత్నంగా ఆలోచించగలిగే సామర్థ్యాలతో డిజిటల్ విప్లవానికి సంబంధించి భారత్ ముందంజలో ఉంటున్న నేపథ్యంలో దేశీయంగా వచ్చే 6 నెలల్లో ఐటీ సర్వీసుల్లో హైరింగ్ 10–12 శాతం పెరగవచ్చని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు.
టాప్ 5 నైపుణ్యాలు..
నివేదిక ప్రకారం రెండో త్రైమాసికానికి సంబంధించి హైరింగ్ డిమాండ్‌లో 79 శాతం వాటా .. ఈఆర్‌పీ, టెస్టింగ్, నెట్‌వర్కింగ్, డెవలప్‌మెంట్, డేటా సైన్స్ వంటి అయిదు నైపుణ్యాలది ఉంది. వీటికి తోడు జావా (30 శాతం), సైబర్‌సెక్యూరిటీ (20 శాతం), డెవ్‌ఆప్స్ (25 శాతం) వంటి ప్రత్యేక నైపుణ్యాలకు కూడా డిమాండ్ నెలకొంది.క్యూ2లో టెక్ హైరింగ్‌కి సంబంధించి జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ఏఐ/ఎంఎల్, అనలిటిక్స్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్, డెవ్‌ఆప్స్ నిపుణులకు డిమాండ్ కనిపించింది.
ప్రాంతాలవారీగా చూస్తే మొత్తం ఉద్యోగావకాశాలకు సంబంధించి 62 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. 43.5 శాతంతో హైదరాబాద్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా జీసీసీలు విస్తరిస్తుండటంతో వివిధ నగరాల్లో ప్రతిభావంతులకు డిమాండ్ పెరిగింది. ఈ సంస్థలు ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్, అనలిటిక్స్ వంటి విభాగాల్లో సుశిక్షితులైన నిపుణులపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment