Elliot Alderson: Koo App Leaking Users Personal Data China Connection - Sakshi
Sakshi News home page

‘కూ’ యాప్‌ సురక్షితమేనా? సంచలన విషయాలు

Published Thu, Feb 11 2021 11:55 AM | Last Updated on Thu, Feb 11 2021 1:49 PM

Koo leaking sensitive users data, China connection surfaces - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రైతులు  ఉద్యమం సందర్బంగా కొంతమంది దేశీయ, విదేశీ ప్రముఖులు చేసిన ట్విట్లు వివాదం రేపాయి. ఈ క్రమంలో ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా   దేశీయ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ‘‘కూ’‘ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అధికార బీజేపీ కేంద్ర మంత్రులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు కూ యాప్‌  వైపు షిప్ట్‌ కావడం చర్చకు దారి తీసింది. ఈనేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుల సంచలన విషయాలను వెల్లడించారు. కూ సురక్షితం కాదనీ, ప్రస్తుతం, ఇది ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు , పుట్టిన తేదీతో సహా చాలా సున్నితమైన వినియోగదారుల సమాచారాన్ని లీక్ చేస్తోందని ఫ్రెంచ్ భద్రతా పరిశోధకుడు రాబర్ట్ బాప్టిస్ట్ తేల్చారు. అంతేకాదు కూతో చైనీస్ కనెక్షన్‌ను చూపించే డొమైన్ రికార్డును కూడా బాప్టిస్ట్ షేర్‌ చేశారు. అయితే బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ నాలుగేళ్ల  క్రితం క్రియేట్‌ చేసిన డొమైన్‌ అని,  ఇప్పటికే ఇది చాలా చేతులు మారినట్టు  రికార్డుల ద్వారా  తెలుస్తోంది. (ట్విటర్‌కు షాక్‌: దేశీ ట్విటర్ ‘కూ’ జోరు)

ట్విటర్‌లో ఇలియట్ ఆండర్సన్  పేరుతో ప్రసిద్ది చెందిన రాబర్ట్ బాప్టిస్ట్‌  తన రీసెర్చ్‌ వివరాలను ట్విటర్‌లో  షేర్‌ చేశారు.  గత రాత్రి కూ యాప్‌లో 30 నిమిషాలు గడిపాననీ, వినియోగదారుల వ్యక్తిగత డేటాను లీక్ చేస్తోందని స్పష్టం చేశారు. ఈమెయిల్, పుట్టిన తేదీ, పేరు, వైవాహిక స్థితి, జెండర్‌ సహా, ఇతర వివరాలు బహిర్గతమవుతున్నాయని చెప్పారు. గతంలో ఆధార్ వ్యవస్థతోపాటు, ఇతర టెక్ సేవల్లో అనేక సెక్యూరిటీ లోపాలను ఎత్తిచూపిన బాప్టిస్ట్ తాజాగా కూపై కూడా దృష్టి సారించారు. ఈ సందర్భంగా కొన్ని భద్రతా  లోపాలను గుర్తించారు. ఆ మేరకు స్క్రీన్‌షాట్‌లను కూడా పంచుకున్నారు. దీంతో ఇప్పటికే ఈ యాప్‌లో చేరిన  ప్రభుత్వ విభాగాలు, ఇతర సేవలు, మంత్రుల డేటాతో సహా మిలియన్ల వినియోగదారుల డేటా ఇప్పటికే లీక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.  (‘కూ’ అకౌంట్‌ను ఇలా ఓపెన్‌ చేయండి..)

చైనా  కంపెనీ పెట్టుబడులు 
ఆత్మనిర్భర్ యాప్‌గా చెబుతున్న కూలో చైనా కంపెనీ పెట్టుబడులు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమి అనుసంధాన కంపెనీ షున్‌వేకి ఇందులో వాటాలున్నాయి. (షున్‌వే వెంచర్ క్యాపిటల్ ఫండ్ సంస్థ. స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది). ఈ విషయాన్ని కూ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ   ధృవీకరించారు కూడా. షున్‌వే వాటాలు ఇప్పటికీ ఉన్నాయని, త్వరలో వీటిని విక్రయిస్తుందంటూ ట్వీట్‌ చేశారు. అయితే కూ అనేది భారతీయ వ్యవస్థాపకుల ద్వారా రిజిస్టర్డ్ కంపెనీ అనీ,రెండున్నరేళ్ల క్రితం మూలధనాన్ని సమీకరించిందని తెలిపారు.బాంబినేట్ టెక్నాలజీస్‌కు సంబంధించిన తాజా నిధులు నిజమైన భారతీయ పెట్టుబడిదారుడు  3వన్‌4 క్యాపిటల్ నేతృత్వంలో ఉన్నాయని వివరణ ఇచ్చారు. సింగిల్ డిజిట్ వాటాదారు షున్‌వే  త్వరలోనే పూర్తిగా నిష్క్రమించనుంది అంటూ ట్వీట్ చేశాడు.

ఫేక్‌ ఖాతాపై వివరణ
కూ అధికారిక ఖాతాపై గందరగోళానికి కూడా రాధాకృష్ట చెక్‌ పెట్టారు. KooAppOfficial అనేది నకిలీదని చెప్పారు. కూ యాప్‌ అధికారిక ఖాతా @kooindia అని గమనించాలంటూ ఆయన ట్వీట్ చేశారు.

కాగా  రైతుల నిరసనలపై ట్వీట్ చేస్తున్న జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తల ఖాతాలను బ్లాక్ చేయడానికి ట్విటర్ నిరాకరించడంపై ఐటీశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్విటర్‌ నుంచి కూ యాప్‌లోకి మారుతున్నట్టు  కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌  ప్రకటించారు.  అలాగే పలువురు ప్రముఖులు దేశీ  ఆత్మనిర్భర్  యాప్‌ను వాడాలని చెప్పడంతో  ఒక్కసారిగా  కూ యాప్‌ డోన్‌లోడ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. గత 24 గంటల్లో  30 లక్షలకుపైగా డౌన్‌లోడ్‌లు నమోదు చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement