
గత క్యాలండర్ ఏడాది(2021)లో కొత్త రికార్డులకు నెలవైన ప్రైమరీ మార్కెట్ కొత్త ఏడాది(2022)లోనూ కళకళలాడనుంది. జనవరి-మార్చి త్రైమాసికంలో దాదాపు రెండు డజన్ల కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. వెరసి ఉమ్మడిగా రూ. 44,000 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేశాయి. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్‌కు ధీటుగా కొత్త ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్‌లో సందడి కొనసాగనుంది. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 23 కం పెనీలు ఐపీవోలకు రానున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 44,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. ఓవైపు కరోనా మహమ్మారి సమస్యలు సృష్టించినప్పటికీ 2021లో మొత్తం 63 కంపెనీలు రూ. 1.2 లక్షల కోట్లను సమకూర్చుకోవడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే.
ఇవికాకుండా పవర్‌గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ రూ. 3,800 కోట్లు చొప్పున పెట్టుబడులను సమీకరించాయి. కాగా.. ఈ ఏడాది క్యూ1(జనవరి–మార్చి)లో అత్యధిక శాతం ఆధునిక తరం టెక్నాలజీ కంపెనీలు ఐపీవో మార్కెట్లలో ఆధిపత్యం వహించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన లిక్విడిటీ, లాభాలతో లిస్టవుతున్న కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్ల భారీ ఆసక్తి ప్రధానంగా ప్రైమరీ మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు మరోసారి తెలియజేశారు.
కంపెనీల క్యూ
తాజా త్రైమాసికంలో నిధుల సమీకరణ బాట పట్టిన కంపెనీల జాబితాలో ప్రధానంగా హోటల్ రూముల సంస్థ ఓయో(రూ. 8,430 కోట్లు), సప్లై చైన్ కంపెనీ డెల్హివరీ(రూ. 7,460 కోట్లు), బాస్మతి బియ్యం, వంటనూనెల దిగ్గజం అదానీ విల్మర్(రూ. 4,500 కోట్లు), ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్స్(రూ. 4,000 కోట్లు), వేదాంత్ ఫ్యాషన్స్(రూ. 2,500 కోట్లు), పారదీప్ ఫాస్ఫేట్స్(రూ. 2,200 కోట్లు), ఇక్సిగో(రూ. 1,800 కోట్లు), మెడాంటా(రూ. 2,000 కోట్లు), ఇక్సిగో(రూ. 1,800 కోట్లు) ఉన్నాయి.
వీటితోపాటు స్కాన్‌రే టెక్నాలజీస్, హెల్దియం మెడ్‌టెక్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ తదితరాలు సైతం పబ్లిక్ ఇష్యూ చేపట్టనున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. అంతేకాకుండా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు వాటాల విక్రయం ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకూ ఐపీవోలు అవకాశమివ్వనున్నాయి.
నిపుణులు ఏమంటున్నారంటే..
స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయితే లిక్విడిటీ పెరగడంతోపాటు.. విలువ మదింపునకు వీలుంటుందని కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు ఆసక్తి చూపుతాయని రికర్ క్లబ్ వ్యవస్థాపకుడు ఏకలవ్య పేర్కొన్నారు. అంతర్జాతీయంగా విస్తరించే ప్రణాళికలకు అవసరమైన పెట్టుబడుల కోసం కొన్ని కంపెనీలు ఐపీవో బాట పడుతుంటాయని లెర్న్‌యాప్.కామ్ సీఈవో ప్రతీక్ సింగ్ తెలియజేశారు.
మరోవైపు యాంకర్ ఇన్వెస్టర్ సంస్థలు తమ పెట్టుబడులపై లాభార్జన కోసం వీటిని వినియోగించుకుంటాయని వివరించారు. అయితే ఇటీవల క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐపీవో నిబంధనలను కఠినతరం చేసిన విషయం విదితమే. ప్రధానంగా నిధుల వినియోగాన్ని సెబీ పర్యవేక్షించనుండటంతో యూనికార్న్ సంస్థలు తగిన లక్ష్యం లేకుండా పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు వీలుండదని సైరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ యాష్ అషర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment