బంగారు బాతును కాపాడుకోవాలి! | Central Govt To Sell Life Insurance Corporation Stakes | Sakshi
Sakshi News home page

బంగారు బాతును కాపాడుకోవాలి!

Published Sat, Sep 3 2022 1:09 AM | Last Updated on Sat, Sep 3 2022 1:10 AM

Central Govt To Sell Life Insurance Corporation Stakes - Sakshi

ఎల్‌ఐసీ దేశానికి ఎంతో ఇచ్చింది. ఇంకెంతో ఇవ్వనుంది. మరి ప్రభుత్వం దానికి తిరిగి ఏమిస్తోంది? నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలనూ, కార్పొరేషన్లనూ ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేయడం ఒక విధానంగా పెట్టుకున్న కేంద్రం... అక్షయ పాత్రలాంటి ఎల్‌ఐసీనీ ప్రైవేటీకరించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 1956లో ప్రభుత్వం సమకూర్చిన ఐదు కోట్ల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 66 ఏళ్లలో రూ. 31 వేల కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్‌ రూపంలో ఇచ్చింది ఎల్‌ఐసీ. 2022 మార్చి 31 నాటికి రూ. 40,84,826 కోట్లు దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిగా పెట్టింది. అదే సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు చౌకగా బీమా సౌకర్యాన్నీ కల్పిస్తూ వచ్చింది. అయినా ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాను ప్రభుత్వం అమ్మివేసింది.

ఈ మధ్య ఎన్‌టీఆర్‌ఐను ప్రారంభిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బీహెచ్‌ఈఎల్‌ (భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌) ఎల్‌ఐసీ (లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) లేకుండా దేశ ప్రగతిని ఊహించుకోలేమనీ, ఎల్‌ఐసీ గత 66 ఏళ్లలో అద్భుతంగా రాణిస్తోందనీ కితాబు ఇచ్చారు. అటువంటి అద్భుత సంస్థ ‘యోగక్షేమం వహామ్యహం’ (ప్రజల యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను) అనే నినాదంతో మొదలై  2022 సెప్టెంబర్‌ 1 నాటికి 66 ఏళ్ళు పూర్తి చేసుకుని 67వ ఏడాదిలోకి అడుగుపెట్టింది.

1956లో ఎల్‌ఐసీ ఆవిర్భవించిన నాటి నుండి ‘ప్రజల పొదుపు ప్రజా సంక్షేమానికి’ అనే నినాదంతో, ఉన్నత లక్ష్యాలతో పనిచేయబట్టే... నేడు ప్రజల, పాలసీ దారుల చిరస్మరణీయమైన నమ్మకం చూరగొంది. అడుగడుగునా తనను నమ్మి తన మీద భరోసా పెట్టుకున్న ఖాతాదారులకు అభయం ఇచ్చి, ఎల్‌ఐసీ దేశీయ జీవిత బీమా రంగంలో మార్కెట్‌ మేకర్‌గా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022 మార్చి 31 నాటికి ఎల్‌ఐసీ రూ. 40,84,826 కోట్ల పెట్టుబడులను మన దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టింది. ఇందులో రూ. 28,85,569 కోట్ల నిధులను హౌసింగ్, నీటిపారుదల సౌకర్యాల కల్పనకూ; కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలకూ కేటాయించింది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూ. 14,23,055 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసీ సమకూర్చింది. దేశ అంతర్గత వనరుల సమీకరణలలో ఎల్‌ఐసీ వాటా 25 శాతం పైమాటే!

2021–22 ఆర్థిక సంవత్సరంలో క్లెయిముల చెల్లింపుల రూపేణా దాదాపు లక్ష కోట్ల మేరకు పాలసీ దారులకు చెల్లించింది. 99 శాతం క్లెయిముల పరిష్కారం రేటుతో క్లెయిముల పరిష్కారంలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా పేరెన్నికగన్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే (ఏప్రిల్‌ నుండి జూన్‌ లోపల) 85,298 కోవిడ్‌  డెత్‌  క్లెయిములను పరిష్కరించి, రూ. 2,334 కోట్లు పాలసీదారుల వారసులకు చెల్లించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 614 శాతం ఎక్కువ. నిమిషానికి 41 పాలసీలను విక్రయిస్తూ, 2021–22 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల 17 లక్షల పాలసీలను ఎల్‌ఐసీ సేకరించింది. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం నికర ప్రీమియం ఆదాయం పెరిగింది.

22 సంవత్సరాల పోటీ తర్వాత కూడా ఎల్‌ఐసీ ప్రీమియం ఆదాయం అంశంలో మార్కెట్‌ వాటాలో 65 శాతం కలిగి ఉంది. పాలసీల సంఖ్యలో దాదాపు 74 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. ఇది అపూర్వమైన ఘనత. ఏ దేశంలో లేని విధంగా... ఒకే కంపెనీ, అది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీ, మార్కెట్‌ ఆధిపత్యాన్ని కలిగి ఉండటం ఒక్క ఎల్‌ఐసీ విషయంలో మాత్రమే సాధ్యమైంది. గత ఏడాది ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడులపై రూ. 36,000 కోట్లు లాభం ఆర్జించిన ఎల్‌ఐసీ సంస్థ, ఈ ఏడాదిలో రూ. 42,000 కోట్లు లాభాలు ఆర్జించింది.గత ఏడాది జూన్‌ నాటికి ఎల్‌ఐసీ ఆస్తులు రూ. 38.13 లక్షల కోట్లు కాగా, ఇప్పుడవి రూ. 42 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 23 ప్రయివేటు బీమా కంపెనీల మొత్తం ఆస్తుల కన్నా 3 రెట్లు ఆస్తులు, ఎల్‌ఐసీ సంస్థ కలిగి ఉంది. రెండో అతిపెద్ద ప్రయివేటు జీవిత బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్‌తో పోలిస్తే, ఎల్‌ఐసీ ఆస్తులు 16 రెట్లు ఎక్కువ. దేశంలో మొత్తం మ్యూచ్యువల్‌ ఫండ్ల ఆస్తుల కన్నా, ఎక్కువ ఆస్తులను ఎల్‌ఐసీ కలిగి ఉంది.

2021–22లో పాలసీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులలో 98 శాతం 15 రోజుల వ్యవధిలోనే పరిష్కరించి అత్యుత్తమ పారదర్శక సంస్థగా నిలిచింది. ‘ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన’ పథకం ద్వారా అతి తక్కువ ప్రీమియంతో ప్రజలకు బీమా రక్షణ కల్పిస్తోంది. కార్పొరేట్‌ నిర్వహణలో ఎల్‌ఐసీ అనేక అవార్డులు, రివార్డులు పొందింది. స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకులు చోటుచేసుకున్న ప్రతి సందర్భంలోనూ ఎల్‌ఐసీనే మార్కెట్లను ఆదుకుంది. ‘మోస్ట్‌ ట్రస్టెడ్‌ బ్రాండ్‌’. ‘బెస్ట్‌ బ్రాండ్‌ అవార్డ్‌’తో సహా ప్రతిష్టాత్మకమైన 25 అవార్డులను ఎల్‌ఐసీ సొంతం చేసుకుంది. అనేక సార్లు అత్యుత్తమ కార్పొరేట్‌ నిర్వహణకు ‘బంగారు నెమలి‘ను పొందింది.

ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుదేలై ఉన్న అస్తవ్యస్త పరిస్థితుల నడుమ ఎల్‌ఐసీని స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ చేశారు. దాంతో తర్వాత కాలంలో ఎల్‌ఐసీ షేర్‌ విలువ దాదాపు 28 శాతం తగ్గిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని, ఎల్‌ఐసీ సంస్థ ఏనుగు వలే శక్తి మంతమైనది అయినప్పటికీ, అది నాట్యం చేయలేదని కొందరు మార్కెట్‌ పండితులు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. అయితే, జేపీ మోర్గాన్‌ సంస్ధ తన తాజా నివేదికలో, ఎల్‌ఐసీ నిజ విలువను, శక్తిని గుర్తించడంలో మార్కెట్‌ విఫలమైందని వ్యాఖ్యానించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో ఎల్‌ఐసీ నూతన వ్యాపార వృద్ధి రేటు 95 శాతంగా ఉంది. కాగా, ప్రయివేటు బీమా కంపెనీల వృద్ధి దాదాపు 48 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఎల్‌ఐసీ వృద్ధి రేటు 63 శాతం కాగా, ప్రయివేటు కంపెనీల వృద్ధి రేటు 38 శాతంగా ఉంది. తాజాగా ఎల్‌ఐసీ ఫార్ట్యూన్‌ గ్లోబల్‌ –500 కంపెనీల జాబితాలో చోటు సంపాదించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి లిస్ట్‌ అయిన కంపెనీల ఆదాయం, లాభాల ఆధారంగా తయారు చేసిన ఈ జాబితాలో లిస్టింగ్‌ అయిన రెండు నెలల లోపలే ఎల్‌ఐసీ 98వ స్థానం పొందింది. ఎల్‌ఐసీ వ్యాపారాభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఎల్‌ఐసీ షేర్‌ విలువ కూడా పెరుగుతోంది. 

దేశంలో ద్రవ్యోల్బణం దౌడుతీస్తోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి నానాటికీ క్షీణిస్తోన్న పరిస్థితుల్లో సైతం ఎల్‌ఐసీ చక్కని ప్రదర్శన చేస్తోంది. ప్రయివేటు బీమా సంస్థలు మెట్రోలు, మహానగరాలకే  పరిమితమయినా... ఎల్‌ఐసీ గ్రామీణ ప్రాంతాలకూ తన సేవలను విశేషంగా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుండి ఎల్‌ఐసీకి 48.22 శాతం ఏజెంట్లు ఉండగా, వారి ద్వారా ఎల్‌ఐసీకి మొత్తం పాలసీలలో 21.46 శాతం, ప్రీమియంలో 15.6 శాతం వ్యాపారం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలను, బలహీన వర్గాలను విస్మరిస్తే తలెత్తే ప్రతికూల ప్రభావం ఈ గణాంకాల ద్వారా అర్థమవుతుంది. ఎల్‌ఐసీ వ్యాపారాన్ని గమనిస్తే 28.89 శాతం పాలసీదారులు సాలీనా లక్ష కంటే తక్కువ సంపాదన గలవారు. 43 శాతం పాలసీదారుల వార్షిక ఆదాయం రూ. లక్ష నుండి రెండు లక్షల మధ్యలో ఉన్నది.

2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ పాలసీల సగటు ఏడాది ప్రీమియం రూ. 25,000 కాగా, ప్రయివేటు కంపెనీ లలో ఇది రూ 1,06,000 గా ఉంది. దీనిని విశ్లేషించినప్పుడు ప్రైవేటు బీమా కంపెనీలు పెద్ద  పాలసీలపై దృష్టి పెడితే, ఎల్‌ఐసీ సంస్థ ఒక్కటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ బీమా రక్షణ కలిగిస్తోందని స్పష్టమవుతోంది. పెద్ద ప్రీమియం పాలసీలు, అర్బన్‌ వ్యాపారం బీమా సంస్థలకు లాభసాటి గనుక, ఎల్‌ఐసీలో వాటాలు కొన్న పెట్టుబడిదారులకు అధిక లాభాలను తెచ్చి పెట్టే  వ్యాపారం వైపు  సంస్థ పరుగులు పెట్టవలసి వస్తే అది భారతదేశ గ్రామీణ పేద, బలహీన వర్గాల ప్రయోజనాలకు భంగకరం అవుతుంది. 40 లక్షల మంది ఎల్‌ఐసీ షేర్‌ హోల్డర్ల ప్రయోజనాల కన్నా, 40 కోట్ల పాలసీదారుల ప్రయోజనాలూ, విశాల దేశ ప్రయోజనాలే పరమావధిగా ఎల్‌ఐసీ బోర్డు అడుగులు వేయాలి.

ప్రజల, ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత నడుమ ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాలు మాత్రమే ప్రస్తుతానికి అమ్మడం జరిగింది. ఎల్‌ఐసీ కేంద్ర ప్రభుత్వానికి అక్షయ పాత్ర లాంటిది. 1956లో ప్రభుత్వం ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలతో కార్యకలాపాలు ప్రారంభించి... ఇప్పటివరకూ 31 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి డివిడెంట్‌ చెల్లించింది. నిరంతరం, దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం నిధులు అందిస్తూనే ఉంది. అటువంటి బంగారు బాతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది పోయి తెగనమ్మే ప్రయత్నాలు చేయడం సరికాదు. ప్రభుత్వం తన విధానాన్ని పునస్సమీక్షించుకుంటుందని ఆశిద్దాం.


పి. సతీష్‌, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం
సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షులు ‘ 94417 97900 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement