న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) పబ్లిక్ ఇష్యూకి పాలసీదారులు మద్దతిస్తున్నారు. ఇష్యూ తొలి రోజు(బుధవారం) పాలసీదారుల విభాగంలో 1.9 రెట్లు అధిక స్పందన లభించింది. ఇక ఉద్యోగుల కోటా సైతం పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయినట్లు బీఎస్‌ఈ గణాంకాలు పేర్కొన్నాయి.
క్విబ్ విభాగంలో 27 శాతం, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో 33 శాతం చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 60 శాతం దరఖాస్తులు లభించినట్లు తెలుస్తోంది. యాంకర్ విభాగాన్ని మినహాయించి దాదాపు 16.21 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 10.86 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి తొలి రోజు మొత్తం 67 శాతం బిడ్స్ లభించినట్లు స్టాక్ ఎక్ఛేంజీల గణాంకాలు వెల్లడించాయి.
రాయితీ ధరలో..
ఎల్‌ఐసీ ఐపీవోలో భాగంగా షేరుకి రూ. 902–949 ధరలో ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది. ఈ నెల 9న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. పాలసీదారులకు షేరు ధరలో రూ. 60 డిస్కౌంట్ ప్రకటించగా.. ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున రాయితీని ఇస్తోంది. ఐపీవోలో భాగంగా సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,627 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ ఆసక్తి చూపగా.. రూ. 949 ధరలో దాదాపు 5.93 కోట్ల షేర్లను జారీ చేయనుంది. ఇష్యూ తదుపరి ఎల్‌ఐసీ 17న స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఇప్పటివరకూ రూ. 18,300 కోట్ల ఇష్యూ(2021)తో పేటీఎమ్, రూ. 15,500 కోట్ల సమీకరణ(2010)తో కోల్ ఇండియా, రూ. 11,700 కోట్ల(2008)తో రిలయన్స్ పవర్.. అతిపెద్ద ఐపీవోలుగా తొలి మూడు ర్యాంకుల్లో నిలుస్తున్నాయి. తాజా ఇష్యూ ద్వారా ఎల్‌ఐసీ సరికొత్త రికార్డుకు తెరతీయనుంది.
ఆదివారం సైతం
బుధవారం(4న) ప్రారంభమైన ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకి మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ తాజా చర్యలు తీసుకుంది. వారాంతాన అంటే ఆదివారం(8న) ఏఎస్‌బీఏ సంబంధిత బ్యాంకు బ్రాంచీలు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. దీంతో పబ్లిక్‌కు 8న సైతం బిడ్డింగ్‌కు వీలు కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment