ముంబై: కార్పొరేట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ప్రపంచ సంకేతాలకు అనుగుణంగా ఈ వారం స్టాక్ సూచీలు కదలాడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా నేడు విడుదలయ్యే మార్చి నెల టోకు ద్రవ్యోల్బణం గణాంకాలపై దృష్టి పెట్టొచ్చు. కోవిడ్ కేసుల నమోదు, ఉక్రెయిన్– రష్యా యుద్ధ పరిణామాల నుంచి ఇన్వెస్టర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు.
ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూను వేగవంతం చేసేందుకు కేంద్రం చేపడుతున్న సన్నాహాలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. ‘‘జాతీయ, అంతర్జాతీయంగానూ సెంటిమెంట్ బలహీనంగానే ఉంది. ఇప్పటికే క్యూ4 ఫలితాల విడుదల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్ సూచీలను నడిపించవచ్చు. గతవారం చివరి ట్రేడింగ్ రోజున నిఫ్టీకి 17,450 వద్ద కీలక మద్దతు లభించింది. అమ్మకాలు కొనసాగితే 17,200 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 17,000 వద్ద మద్దతు లభించొచ్చు. స్వల్పకాలంలో మార్కెట్ స్థిరీకరించుకునే అవకాశాలు ఎక్కువ’’ శామ్‌కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు.
మూడు రోజులే ట్రేడింగ్ జరిగిన గతవారంలో సెన్సెక్స్ 1,100 పాయింట్లు, నిఫ్టీ 309 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ద్రవ్యోల్బణం విషయంలో ఆందోళనలు, వడ్డీరేట్ల పెంపు భయాలతో పాటు దేశీయంగా క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్ ఆరంభంలో నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు.
మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తే..,
కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల ప్రభావం..
ముందుగా నేడు మార్కెట్ ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. టెక్ దిగ్గజం ఇన్ఫీ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పటిష్ట గణాంకాలను వెల్లడించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక వారంలో సుమారు 50కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, మెండ్‌ట్రీ, నెస్లే ఇండియా, ఏసీసీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, టాటా కమ్యూనికేషన్, ర్యాలీస్ ఇండియా మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది.
కలవరపెడుతున్న కరోనా కేసులు
కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి. చైనాలో షాంఘైతో పాటు పలు నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో దాదాపు 40 కోట్ల మంది ఆంక్షల గుప్పిట్లో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. మనదేశంలో కొత్తగా 1,150 కొవిడ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయని ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తిరిగి పెరుగుతున్న కరోనా కేసుల మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ద్రవ్యోల్బణ ఆందోళనలు
భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో కమోడిటీ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. దేశీయంగా వరుస మూడు నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ద్రవ్యోల్బణంకట్టడి చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే ఆహార, ఇంధన ధరలు పెరిగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు.
అమ్మకాల బాటలో ఎఫ్‌ఐఐలు
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంచేందుకు సిద్ధమైందనే భయాలతో దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు గతవారంలో రూ.4,518 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇందులో డెట్ విభాగం నుండి రూ. 415 కోట్లు వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు (ఏప్రిల్ 1–13 తేదీల మధ్య) రూ.6,335 కోట్ల షేర్లను విక్రయించారు. ఉక్రెయిన్ సంక్షోభం తగ్గుముఖం పడితే ఎఫ్‌ఐఐలు తిరిగి భారత మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టవచ్చని మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment