న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు నుంచి నాలుగు వరకు నూతన పాలసీలను ఆవిష్కరించనుంది. నూతన వ్యాపార ప్రీమియంలో రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ‘‘గతేడాదితో పోలిస్తే రెండంకెల వృద్ధిని సాధిస్తాం. ఎందుకంటే ఇండివిడ్యువల్ రిటైల్ వ్యాపారం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆకర్షణీయమైన కొత్త పాలసీలను ఆవిష్కరించనున్నాం’’అని ఎల్‌ఐసీ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు.
డిసెంబర్ మొదటి వారంలో ఎల్‌ఐసీ ఒక ఉత్పత్తిని తీసుకువస్తుందని వెల్లడించారు. దీనితో మార్కెట్లో మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్‌లో తెచ్చే నూతన పాలసీ గురించి వివరిస్తూ.. పాలసీ మెచ్యూరిటీ తర్వాత (గడువు ముగిసిన అనంతరం) జీవితాంతం ఏటా సమ్ అష్యూర్డ్‌లో (బీమా కవరేజీలో) 10 శాతం చొప్పున లభిస్తుందని తెలిపారు.
ఇది మార్కెట్లో సంచలనాన్ని సృష్టిస్తుందన్నారు. 20–25 ఏళ్ల తర్వాత ఎంత చొప్పున వస్తుంది, ఎంత ప్రీమియం చెల్లించాలన్నది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నారు. ఈ ప్లాన్‌పై రుణ సదుపాయం, ముందస్తు ఉపసంహరణకూ అవకాశం ఉంటుందన్నారు.
హామీతో కూడిన రాబడులు ఇచ్చే పాలసీలకు పాలసీదారులు, వాటాదారులు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతూ.. తమ కంపెనీ వాటాదారుల్లో చాలా మంది పాలసీదారులుగా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) నూతన వ్యాపార ప్రీమియం (ఇండివిడ్యువల్) 2.65 శాతమే వృద్ధి చెంది రూ.25,184 కోట్లకు చేరుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment