ఓవైపు పెట్రోలు ధరలపై తగ్గింపు ప్రకటించిన చమురు సంస్థలు మరో వైపు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచేశాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.100 వంతున చమురు కంపెనీలు ధర పెంచాయి. బుధవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తున్నట్టు ఏఎన్‌ఐలో కథనం ప్రచురితమైంది. దీనిపై చమురు కంపెనీలు ఇంకా నోరు విప్పలేదు.
ఇంతకు ముందు నవంబరు 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.266 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర సగటున రూ.2000లకు అటుఇటుగా నమోదు అవుతోంది. సరిగ్గా నెల రోజుల వ్యవధి ఇచ్చి ఈసారి సిలిండర్ ధరను వంద రూపాయలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా సగటున సిలిండర్ ధర రూ.2100కి చేరుకుంది.
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు చిరు వ్యాపారులు, హోటళ్లు, స్ట్రీట్‌ఫుడ్ వెండర్లకు భారంగా మారింది. ఇప్పుడిప్పుడు ఆర్థిక పరిస్థితి కుదురుకుంటుందని భావించేలోగా వరుసగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. వ్యాపారంపై వస్తున్న అరకొర సంపాదన పెరుగుతున్న ధరలకే సరిపోతుందంటూ వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1905 ఉండగా పెరిగిన ధరలతో రూ.2005కి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment