సాక్షి, హైదరాబాద్: కరోనా గృహ కొనుగోలుదారుల అభిరుచిని మార్చేసింది. ప్రపంచ జీవన శైలి, జీవన ప్రమాణాలపై అవగాహన, ఆదాయం పెరిగాయి. దీంతో కోవిడ్ తర్వాత గృహ ఎంపికలో మార్పులు వచ్చాయి. గతంలో గృహ కొనుగోళ్లలో బడ్జెట్ మీద దృష్టి పెట్టిన కొనుగోలుదారులు.. కరోనా తర్వాతి నుంచి విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఇళ్ల మీద ఆసక్తి చూపిస్తున్నారు.
► గత ఆర్థ్ధిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో గృహ కొనుగోలుదారుల ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే సరసమైన ఇళ్ల కంటే రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మధ్య తరహా గృహాలు, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉండే ఆధునిక గృహాల కొనుగోళ్లకే కస్టమర్లు ఆసక్తిని చూపిస్తున్నారు. దాదాపు 80 శాతం మంది కస్టమర్లు మధ్య తరహా, ఆధునిక గృహాలపై ఆసక్తిని కనబర్చగా.. కేవలం 10 శాతమే అందుబాటు గృహాల వైపు ఆసక్తిగా ఉన్నారు.
► గృహ కొనుగోళ్లలో సర్వీస్ క్లాస్ కొనుగోలుదారులదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికీ పెద్ద సైజు గృహాలకే డిమాండ్ ఎక్కువగా ఉందని అనరాక్ డేటా వెల్లడించింది. గృహ విక్రయాలలో మిడ్ టు హై ఎండ్ విభాగం యూనిట్లకే ఎక్కువ గిరాకీ ఉంది. మొత్తం విక్రయాలలో ఈ విభాగం వాటా 79 శాతంగా ఉంది. 2 బీహెచ్‌కే యూనిట్లకు 38 శాతం, 3 బీహెచ్‌కేకు 26 శాతం వాటా ఉన్నాయి.
హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు..
హైదరాబాద్‌లో రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ గృహాలకు 17 శాతం, అల్ట్రా లగ్జరీ గృహాలకు 8 శాతం డిమాండ్ ఉంది. చెన్నై, పుణే నగరాలలో మధ్య తరహా, లగ్జరీ గృహాలకు డిమాండ్ ఉంది. ఆయా నగరాలలో మిడ్ సైజ్ యూనిట్లకు 60 శాతం, హై ఎండ్ ఇళ్లకు 59 శాతం గిరాకీ ఉంది. బెంగళూరులో దాదాపు 56 శాతం డిమాండ్ హై ఎండ్ గృహాలకే డిమాండ్ ఉంది. ప్రధాన నగరాలలో 2, 3 బీహెచ్‌కే యూనిట్ల విక్రయాలు 64 శాతంగా ఉన్నాయి. చెన్నైలో 2 బీహెచ్‌కే గృహాలకు అత్యంత ప్రజాదరణ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 67 శాతం విక్రయాలు 2 బీహెచ్‌కే యూనిట్లే జరిగాయి. బెంగళూరులో 3 బీహెచ్‌కే విక్రయాల వాటా 49 శాతంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 44 శాతం విక్రయాలు 3 బీహెచ్‌కే యూనిట్లే జరిగాయి.
► రూ.40 లక్షల లోపు ధర ఉండే గృహాల కొనుగోళ్లకు 10 శాతం
► రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే ఇళ్ల కొనుగోళ్లకు 42 శాతం
► రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలపై 37 శాతం
► రూ.1.5 నుంచి రూ.2 కోట్ల మధ్య ధర ఉండే ఇళ్లపై 5 శాతం
► రూ.2–5 కోట్ల ధర ఉండే యూనిట్లపై 5 శాతం
► రూ.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ గృహాల కొనుగోళ్లకు 1 శాతం మంది ఆసక్తిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment