![Market again in rally mode- Auto sector zoom - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/23/Market%20rally%20again-%20Auto%20up.jpg.webp?itok=uYIJA8QU)
నాలుగు రోజుల ర్యాలీకి ముందు రోజు బ్రేక్ పడినప్పటికీ తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ 127 పాయింట్లు లాభపడి 40,686 వద్ద నిలవగా.. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 11,930 వద్ద ముగిసింది. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒక దశలో సెన్సెక్స్ 40,811 వద్ద, నిఫ్టీ 11,975 పాయింట్ల వద్ద గరిష్టాలను తాకాయి. ఆపై కాస్త వెనకడుగు వేసి సెన్సెక్స్ 40,591 వద్ద, నిఫ్టీ 11,909 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాలకు చేరాయి. నిరుద్యోగిత తగ్గడం, గృహ విక్రయాలు పుంజుకోవడం కారణంగా గురువారం అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. ఆసియాలోనూ అధిక శాతం మార్కెట్లు లాభపడటంతో దేశీయంగా సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.
రియల్టీ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ఆటో రంగం 3 శాతం జంప్‌చేయగా.. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, మెటల్ 0.5 శాతం స్థాయిలో ఎగశాయి. అయితే రియల్టీ 1 శాతం, ఫార్మా 0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఐటీసీ, అదానీ పోర్ట్స్ 4.3-1.3 శాతం మధ్య పెరిగాయి. ఇతర బ్లూచిప్స్‌లో అల్ట్రాటెక్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, గెయిల్, హిందాల్కో, ఎస్‌బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివీస్, గ్రాసిమ్, యూపీఎల్ 2.5-0.8 శాతం మధ్య నీరసించాయి.
నౌకరీ జూమ్
డెరివేటివ్స్‌లో నౌకరీ, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్, మదర్‌సన్, బాష్, చోళమండలం, అశోక్ లేలాండ్ 7.6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు కోఫోర్జ్, బయోకాన్, కంకార్, అంబుజా, ఎన్‌ఎండీసీ, ఆర్‌బీఎల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, ఏసీసీ 3.5-1.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,677 లాభపడగా.. 1,028 నష్టాలతో నిలిచాయి.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,118 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,020 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 2,108 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,634 కోట్ల అమ్మకాలు చేపపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment