ముంబై, సాక్షి: ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకుని స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే వెనువెంటనే మళ్లీ అమ్మకాలు తలెత్తడంతో నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 396 పాయింట్లు పతనమై 45,158కు చేరగా.. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 13,197 వద్ద ట్రేడవుతోంది. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా సోమవారం సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 45,938- 45,141 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,447-13,194 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. (మార్కెట్లను ముంచిన కరోనా సునామీ)
ఐటీ మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, ఫార్మా 3- 1 శాతం మధ్య నీరసించాయి. ఐటీ మాత్రమే(0.2 శాతం) ఎదురీదుతోంది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఆర్‌ఐఎల్, ఇండస్‌ఇండ్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్, ఐటీసీ 3.3-2.3 శాతం మధ్య డీలాపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌సీఎల్ టెక్, దివీస్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ 0.5-0.2 శాతం మధ్య బలపడ్డాయి.
నేలచూపులో
డెరివేటి స్టాక్స్‌లో పీవీఆర్, భెల్, పీఎన్‌బీ, ఐబీ హౌసింగ్, జీ, బీఈఎల్, ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, ఎస్కార్ట్స్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్ 8.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క బంధన్ బ్యాంక్, మైండ్‌ట్రీ, ఐజీఎల్ మాత్రమే అదికూడా 1-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,928 నష్టపోగా.. 321 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.
ఎఫ్‌పీఐల వెనకడుగు
నగదు విభాగంలో ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్నవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం దాదాపు రూ. 324 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,425 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment