న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ సహా వివిధ ప్రాజెక్టులపై రూ. 5,000 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ సేథ్ తెలిపారు.
బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ), బీఈవీ బ్యాటరీల తయారీ కోసం సుజుకీ మోటర్స్ గుజరాత్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలపై స్పందిస్తూ .. స్థానికంగా విద్యుత్ వాహనాల ఉత్పత్తికి ఈ పెట్టుబడులు గణనీయంగా దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. అలాగే దేశీయంగా తమ బీఈవీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను వేగవంతంగా విస్తరించుకునేందుకు కూడా ఉపయోగపడగలవని వివరించారు. 2025 నాటికి తమ తొలి బీఈవీని మార్కెట్లో ప్రవేశపెట్టడంపై మారుతీ సుజుకీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
గుజరాత్‌లో బీఈవీలు, బ్యాటరీల తయారీపై 2026 నాటికి రూ. 10,445 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సుజుకీ మోటర్స్ మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరతపై అనిశ్చితి కొనసాగుతోందని అజయ్ తెలిపారు. 2022–23లో కూడా ఉత్పత్తి పరిమాణంపై దీని ప్రభావం కొంత ఉండవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment