MDH Owner Mahashay Dharampal Gulati Biography & Inspirational Success Story In Telugu - Sakshi
Sakshi News home page

ఈ తాత ఊరికే ఫేమస్‌ అవ్వలేదు, సాధించిన సక్సెస్‌ అలాంటిది మరి!

Published Fri, Dec 3 2021 5:18 PM | Last Updated on Fri, Dec 3 2021 6:03 PM

MDH Owner Mahashay Dharampal Biography Inspirational Success Story - Sakshi

MDH Owner Mahashay Dharampal Gulati Biography And Inspirational Success Story: ‘కూర రుచికి ‘మసాలా’ తోడవ్వడం ఎంత అవసరమో.. లైఫ్‌లో సక్సెస్‌ టేస్ట్‌ చేయాలంటే ‘కష్టం’ అంతే ముఖ్యం’ అనేవాడు మహాశయ్‌ ధరమ్‌పాల్‌. ఎండీహెచ్ మసాలా ఓనర్‌గా ఈయన గురించి తెలిసింది చాలా తక్కువ మందికి. కానీ, అదే మసాలా యాడ్‌లో కనిపించే ఆయన ముఖం మాత్రం కోట్ల మందికి గుర్తు!. జీరో నుంచి మొదలుపెట్టి స్వయంకృషితో  కోటీశ్వరుడిగా.. అంతకు మించి ‘మసాలా కింగ్‌’గా ఎదిగిన ధరమ్‌పాల్‌ జీవితం..  ఎంతోమంది చిరువ్యాపారులకు ఇన్‌స్పిరేషన్‌ కూడా. 


‘‘అస్లీ మసాలె సచ్‌ సచ్‌.. ఎం డీ హెచ్‌.. ఎండీహెచ్‌’’ అనే యాడ్‌ గుర్తుందా? దూరదర్శన్‌ రోజుల నుంచి ఇప్పటిదాకా టీవీల్లో కనిపించే యాడ్‌ ఇది. ఈ యాడ్స్‌లో ‘దాదాజీగా, చాచాజీ’గా నవ్వుతూ కనిపించే పెద్దాయనే ఈ మహాశయ్‌ ధరమ్‌పాల్ గులాటి. సెలబ్రిటీ ఎండోర్స్‌మెంట్‌ కోసం పెద్ద పెద్ద బ్రాండ్స్‌ ఎగబడుతున్న రోజుల్లో కూడా తన మసాలా బ్రాండ్‌ని తనే ప్రమోట్‌ చేసుకునేవాడు ధరమ్‌పాల్.  అంతేకాదు  ఈ పెద్దాయన తన ఫేస్‌ వాల్యూతోనే ఎండీహెచ్ కంపెనీని రెండువేల కోట్ల టర్నోవర్‌కి చేర్చాడు. అయితే మసాలా రారాజుగా  ఎదిగే జర్నీలో ఆయన పడిన కష్టాలు.. సినిమా కష్టాలకేం తక్కువ కాదు.

  

ఉత్త చేతులతో పాక్‌ నుంచి.. 
సియాల్‌కోట్‌(ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది)లోని ఓ బడా వ్యాపారి కుటుంబంలో పుట్టాడు(1923) ధరమ్‌పాల్‌. ఈయన తండ్రి మహాశయ్‌ చున్నీలాల్‌ గులాటి,  ఎండు మిర్చి వ్యాపారి. సియాల్‌కోట్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహాశయ్‌ ఫ్యామిలీకి ‘డెగ్గీ మిర్చ్‌ వాలే’ అనే పేరుండేది. 1937లో తన పద్నాలుగేళ్ల వయసులోనే తండ్రితో కలిసి బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు ధరమ్‌పాల్‌. వారసత్వంగా వస్తున్న వ్యాపారంలో రాణిస్తున్న టైంలో ‘విభజన’ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. విభజన టైంలో మహాశయ్‌ ఆస్తులన్నింటినీ పాక్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ఉత్త చేతులతో మహాశయ్‌ కుటుంబం మన దేశానికి వచ్చింది. అమృత్‌సర్‌లో కొన్నాళ్లపాటు శరణార్థుల శిబిరంలో తలదాచుకుంది. ఆ తర్వాత ఢిల్లీకి మకాం మార్చింది. ఆ టైంలో మహాశయ్ పిల్లలు కూలీ పనుల్లో చేరారు. ధరమ్‌పాల్ మొదట్లో చెక్కమిల్లులో పని చేశాడు. అది నచ్చకపోవడంతో సోప్ ఫ్యాక్టరీలో, అక్కడి నుంచి రైస్ ఫ్యాక్టరీలో, అటు నుంచి ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీలో పని చేశాడు. ఏవీ నచ్చక కూడబెట్టిన డబ్బుతో జట్కా బండిని కొనుక్కున్నాడు. అందులోనూ ‘కిక్‌’ దొరక్కపోవడంతో ఇంట్లోని సామాన్లను, గుర్రపు బండిని అమ్మేశాడు. కరోల్‌బాగ్‌లోని అజ్మల్ ఖాన్‌ రోడ్డులో తొలి మసాలా దినుసుల షాప్‌ తెరిచాడు. అలా ఎండీహెచ్‌( మహాశియన్ డి హట్టి) మసాలా సామ్రాజ్యానికి బీజం పడింది.   

వాట్ యాన్‌ ఐడియా
మొదట్లో బల్క్ మసాలా దినుసుల్ని తక్కువ లాభానికి చిరు వ్యాపారులకు అమ్మేవాడు ధరమ్‌పాల్. అది గుర్తించి చాలామంది ఆయన దగ్గరికి ‘క్యూ’ కట్టేవాళ్లు.  ఆ తర్వాత చాందినీచౌక్‌లో 1953లో రెండో షాప్ తెరిచాడు.  1954లో ‘రూపక్‌ స్టోర్స్’ అనే మరో మసాలా స్టోర్‌ని స్టార్ట్ చేసి తమ్ముడు సత్‌పాల్‌కి అప్పజెప్పాడు. నమ్మకంగా వ్యాపారం చేయడం ఆయన సక్సెస్‌కి మెయిన్ రీజన్ అయ్యింది.  ఆ వచ్చిన లాభాలతో 1959లో కీర్తి నగర్‌లో కొంత జాగా కొని.. ఎండీహెచ్‌ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు. మొత్తానికి ‘ప్యాకింగ్ మసాలా’ ఐడియా బాగా వర్కవుట్ అయ్యింది. ఏడాది తిరిగే సరికి ఢిల్లీ మొత్తంతో పాటు పంజాబ్‌లో ఎండీహెచ్‌ మసాలా పేరు మారుమోగింది. తన పేరు వల్లే బిజినెస్‌ నడుస్తోంది గనుక తన ఫొటోనే బ్రాండ్‌ సింబల్‌గా మార్చుకున్నాడు ధరమ్‌పాల్‌. ఆ తర్వాత ఎండీహెచ్ మసాలా ఘుమఘుమలు దేశం మొత్తం విస్తరించాయి.  వయసులో ఉండగా పడిన కష్టాల్ని, తన బిజినెస్‌ సక్సెస్‌ వెనుక ఉన్న సీక్రెట్‌ని ఆత్మకథగా రాసుకున్నాడు ఈ మసాలా కింగ్‌.

సుద్దమొద్దు
‘ఎండీహెచ్ అంకుల్‌, మసాలా కింగ్‌, కింగ్ ఆఫ్ స్పైసెస్‌(మసాలాలు)’.. ఇలా ఎన్నో ట్యాగ్ లైన్లు ఆయన సొంతం. కానీ, చదువులో మాత్రం ఆయన రాణించలేకపోయాడు. కొడుకును బాగా చదివించాలని మహాశయ్‌ ఆరాటపడితే.. ధరమ్‌పాల్ మాత్రం ఐదో తరగతితోనే ఆపేశాడు. కానీ, కష్టం విలువేంటో బాగా తెలిసిన మనిషి ఈయన.  పొద్దున నాలుగున్నరకే లేవడం, ఫ్యాక్టరీకి స్వయంగా వెళ్లి ప్రొడక్ట్స్‌ని చెక్‌ చేయడం, ధరల వివరాల్ని డిసైడ్‌ చేయడం.. మొత్తం ఈయనే చూసుకునేవాడు. అప్పుడప్పుడు ఒక్కడే స్టోర్స్‌కి, గల్లీలోని కిరాణాషాపులకు వెళ్లి మసాలా ప్రొడక్ట్స్‌ అమ్మకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునేవాడు.  తన వ్యాపారాన్ని విస్తరించిన కరోల్‌ బాగ్‌ ఏరియా ధరమ్‌పాల్‌కి పవిత్రమైన స్థలం. అందుకే ఆ ఏరియాకి వెళ్తే ఆయన చెప్పులు వేసుకునేవాడు కాదు.  వయసు పైబడినా బాధ్యతల నుంచి మాత్రం ఏనాడూ ఆయన రెస్ట్ తీసుకోలేదు. చనిపోయేదాకా ధరమ్‌పాల్‌ కంపెనీకి సీఈవోగా ఉన్నాడు. అందుకోసం ఏడాదికి రూ. 20 కోట్లకు పైగా జీతం అందుకున్నాడు.

2017లో ‘ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌’ సీఈవోలలో ఎక్కువ శాలరీ అందుకుంది ఈ పెద్దాయనే కావడం విశేషం. అయితే తన జీతంలో 90 శాతాన్ని ఆయన ట్రస్ట్ కార్యక్రమాలకే ఇస్తుంటాడు. ఢిల్లీలో 250 పడకల ఆస్పత్రితో పాటు 20 ఫ్రీ ఎడ్యుకేషన్‌ స్కూల్స్ కూడా రన్‌ చేస్తోంది ఈయన కుటుంబం. కరోనా టైంలోనూ స్వయంగా ఎందరికో సాయం అందించాడు ధరమ్‌పాల్‌. అంతేకాదు ఎండీహెచ్ కంపెనీ తరపున ‘సందేశ్‌’ అనే ఒక మ్యాగజైన్‌ను కూడా రన్‌ చేస్తున్నారు.

మీమ్స్‌.. లైట్‌
ధరమ్‌పాల్‌కి 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పెళ్లి అయ్యింది. ఇద్దరు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు. 1992లో ఆయన భార్య లీలావతి చనిపోయింది. బయట ఎంతో క్యాజువల్‌గా, జోష్‌గా ఉంటాడు ఈ పెద్దాయన. అంతేకాదు బంధువుల పెళ్లిలలో ఈయన డాన్స్‌లు కూడా చేస్తుంటాడు.  2017లో ఆయన డాన్స్‌ చేసిన ఓ వీడియో ద్వారా ‘చాచాజీ మీమ్స్‌’ ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి. అంతెందుకు ‘మీర్జాపూర్‌’ సిరీస్‌లోని చాచాజీ క్యారెక్టర్‌ మీద మీమ్స్‌ వైరల్ అయినప్పుడు..  చాలామంది ధరమ్‌పాల్‌తో పోలుస్తూ ‘మీమ్‌వాలే చాచాజీ’ అంటూ ట్రోల్‌ చేశారు. దానిని ఆయన ఎంత సరదాగా తీసుకున్నాడంటే..  తన బంధువులకు కూడా ఆ మీమ్స్‌ని ఫార్వర్డ్‌ చేశాడట.


బిజినెస్‌లో హుందాగా.. బయట సరదాగా ఉండే మహాశయన్‌ ధరమ్‌పాల్‌ గులాటికి ఫుడ్‌ ప్రాసెసింగ్ ఫీల్డ్‌లో సేవలకుగానూ ‘పద్మభూషణ్‌’ పురస్కారం దక్కింది. ఇంతటి విజయం అందుకున్న ఈ పెద్దాయన.. అనారోగ్యంతో  ది స్పైస్‌ కింగ్ ఆఫ్‌ ఇండియా 97 ఏళ్ల వయసులో డిసెంబర్​ 3, 2020లో కన్నుమూశారు

- మహాశయన్‌ ధరమ్‌పాల్‌ గులాటి ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement