సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే మోసం చేశారని గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏకంగా మీషో కంపెనీని మోసం చేసి ఏకంగా రూ. 5.5 కోట్లు నష్టాన్ని కలిగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సైబర్ నేరగాళ్లు మీషో ఈ-కామర్స్ కంపెనీలో ఫేక్ సెల్లర్‌గా నటిస్తూ.. అదే ప్లాట్‌ఫామ్‌లో నకిలీ ఖాతాల ద్వారా ఆర్డర్లు చేసేవారు. ఆర్డర్ డెలివరీ చేసుకున్న తరువాత వాటి స్థానంలో విరిగిపోయిన లేదా పాడైపోయిన పాత వస్తువులను పెట్టి మళ్ళీ రిటర్న్ చేసేవారు. దీనిని నిజమని నమ్మించడానికి వీడియోలు కూడా క్రియేట్ చేసేవారు. ఆ తరువాత డబ్బు వెనక్కి తీసుకునేవారు.
మోసగాళ్ళు ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్య ఇదే వరుసలో మోసాలు చేస్తూ.. మీషో నుంచి రూ. 5.5 కోట్లు వసూలు చేశారు. డబ్బు జమచేసుకోవడానికి వీరు వివిధ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించారు. ఈ మోసాన్ని కంపెనీ గుర్తించిన తరువాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మీషో కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత.. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పాల్గొన్న ఇతర నిందితులను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment