
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచి నీటి సరఫరా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. హర్ ఘర్ గంగాజల్ మొదటి దశ పనులతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన బోధ్ గయా, గయా, రాజ్‌గిర్ నగరాల తాగునీటి కష్టాలు తీరిపోనున్నాయి.
శుద్ధి చేసిన గంగాజలాలు ఇకపై ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా గంగా నదీ జలాలు అందుబాటులో లేని ఈ ప్రాంతాలకు వరద నీటిని తాగునీరుగా మార్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వరద నీటిని ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లలో నింపి, శుద్ధిచేసి 365 రోజులు ప్రజలకు తాగునీరు సరఫరా చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టులో భాగంగా 151 కిలోమీటర్ల పొడవు పైప్‌లైన్, నాలుగు వంతెనలతోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు.