హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలు 38.9 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. 2023–24లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇందులో లగ్జరీ వాహన విభాగం 45,000 యూనిట్లను నమోదు చేయవచ్చని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్రాండ్లవి కలిపి 36,000 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయని చెప్పారు. మెర్సిడెస్ బెంజ్‌కు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తరువాత 10 శాతం వాటాతో అయిదవ స్థానంలో హైదరాబాద్ మార్కెట్ నిలిచిందన్నారు. 4–5 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాప్–3 స్థానాన్ని కైవసం చేసుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వినియోగదార్లలో మహిళల వాటా 30 శాతం ఉందన్నారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు..
మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రస్తుతం భారత్‌లో 14 మోడళ్లను విక్రయిస్తోంది. దేశీయంగా ఇవి తయారవుతున్నాయి. ఇవి కాకుండా 10 మోడళ్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని అమ్ముతోంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 3 శాతం ఉంది. దేశవ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరంలో 16,497 యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి ఆశిస్తోంది. టాప్ ఎండ్ మోడళ్లపైనే ఫోకస్ చేస్తున్నట్టు అయ్యర్ తెలిపారు.
‘గతంలో వ్యాపారస్తులు మాత్రమే మా కార్లను కొనేవారు. ఇప్పుడు ఉద్యోగస్తులు సైతం కొంటున్నారు. కస్టమర్లలో వేతన జీవులు 13 శాతం ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఏటా 12 యూనిట్ల వరకు విక్రయిస్తున్నాం. వీటి ధర రూ.8–13 కోట్ల మధ్య ఉంటుంది. పూర్తిగా తయారైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను జర్మనీ నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుంటున్నాం’ అని చెప్పారు.
ఈవీల్లో తొలి స్థానంలో..
మెర్సిడెస్ మొత్తం విక్రయాల్లో 3–4 శాతం ఎలక్ట్రిక్ వాహనాల నుంచి సమకూరుతోంది. కంపెనీకి ఈవీ విభాగంలో 8–9 శాతం వాటాతో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానంలో ఉంటాయని సంతోష్ తెలిపారు. ‘దేశవ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల్లో ఎస్‌యూవీ, సెడాన్ విభాగాలు చెరి 50 శాతం ఉంటాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 70 శాతం ఉంది. ఈ మార్కెట్లో రూ.1.5 కోట్లు, ఆపైన ధర కలిగిన టాప్ ఎండ్ లగ్జరీ కార్ల వాటా 25 శాతం ఉంది. వృద్ధి 40 శాతం ఉండడం విశేషం. కొన్ని మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ 24 నెలల వరకు ఉంది. అయినా కస్టమర్లు వేచి చూస్తున్నారు. వినియోగదార్లు లగ్జరీ కారును నాలుగేళ్లకే మారుస్తున్నారు. గతేడాది 3,000 యూనిట్ల పాత కార్లను విక్రయించాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment