ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐ) రుణ పరిమాణం జూన్ త్రైమాసికం ముగిసే నాటికి రూ.2.85 లక్షల కోట్లని సీఆర్‌ఐఎఫ్ హై మార్క్ నివేదిక ఒకటి తెలిపింది. మార్చి త్రైమాసికంతో పోల్చితే ఈ మొత్తాలు స్వల్పంగా 0.2 శాతం తగ్గినట్లు ఈ క్రెడిట్ సమాచార సేవల సంస్థ వివరించింది. అయితే రుణ నాణ్యత పెరిగినట్లు పేర్కొంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► వార్షికంగా పోల్చితే (గత ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చితే) సూక్ష్మ రుణ పుస్తక విలువ 18 శాతం పెరిగింది. అప్పట్లో కోవిడ్–19 సెకండ్‌వేవ్ ఈ విభాగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.
► జూన్ త్రైమాసికంలో రుణ పంపిణీ రూ.49,788 కోట్లు. మార్చి త్రైమాసికంతో పోల్చితే ఇది 39.2% తక్కువ. అయితే గత ఏడాది ఇదే కా లంతో పోల్చితే మాత్రం 88.9 శాతం అధికం.
► జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి 90 రోజులకు పైగా ఉన్న రుణ బకాయిల విలువ మార్చి త్రైమాసికంతో పోల్చితే 0.5 శాతం తగ్గి 2.2 శాతంగా ఉంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ రేటు భారీగా 1.1 శాతం తగ్గింది.
► ఒక్కో ప్రత్యేక రుణగ్రహీత సగటు బ్యాలెన్స్ మార్చి త్రైమాసికంతో పోల్చితే 1.1 శాతం తగ్గి రూ. 46,400కి చేరింది. కాగా, ఒక్కో ఖాతా సగటు బ్యాలెన్స్ 2.1 శాతం క్షీణించింది.
► సూక్ష రుణ సంస్థల రుణాలు జూన్ త్రైమాసికంలో పట్టణాల్లో 0.8 శాతం క్షీణిస్తే, గ్రామీణ మార్కెట్లలో ఈ తగ్గుదల 0.2 శాతంగా ఉంది.
► దేశ వ్యాప్తంగా చూస్తే, జూన్ 2022 త్రైమాసిక మొత్తం రుణాల్లో తొలి 10 టాప్ మార్కెట్లు 84 శాతం వాటా కలిగి ఉన్నాయి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ అత్యధిక వృద్ధి గణాంకాలను నమోదు చేశాయి.
► పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నదియా జిల్లాలు ఎంఎఫ్‌ఐ రుణాల విషయంలో చివరి వరుసలో ఉన్నాయి.
► ఇక సూక్ష్మ రుణాల విషయంలో బ్యాంకులు 35.6 శాతం పోర్ట్‌ఫోలియో వాటాతో (జూన్ త్రైమాసికంలో) మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే మార్చి త్రైమాసికంతో పోల్చితే పోర్ట్‌ఫోలియోలో 5.6 శాతం క్షీణత నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment