
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు సంబంధించిన అంశాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు .. ప్రస్తుతం జీ20కి అధ్యక్షత వహిస్తున్న భారత్‌కి ’సముచిత స్థాయి’ ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్ బ్రాడ్ స్మిత్ వ్యాఖ్యానించారు. బీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన స్మిత్.. ఈ మేరకు ఒక బ్లాగ్ రాశారు. ఏఐ నియంత్రణ విషయంలో భారత్ సారథ్యం వహించగలదని, ఉదాహరణగా నిలవగలదని పలు దేశాలు ఎదురుచూస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఏఐని అంతర్జాతీయంగా బాధ్యతాయుతంగా వినియోగించుకునేలా వ్యవహరించడం ద్వారా గరిష్టంగా ప్రయోజనాలు పొందవచ్చని స్మిత్ తెలిపారు. భారత్ దృష్టి కోణం నుంచి పాలసీపరంగా తీసుకోతగిన కొన్ని చర్యలను ఆయన సూచించారు. కొత్త టెక్నాలజీల రాక వల్ల సమాజంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించేందుకు ఏఐని సమర్ధంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పనులను వేగవంతంగా, సులువుగా, మెరుగ్గా చేసేందుకు ఉపయోగపడటంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు కొత్త పరిష్కారాలను కనుగొనేందుకు కూడా ఏఐ సహాయపడగలదని స్మిత్ చెప్పారు.