
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు రుతు పవనాల గమనం దారి చూపనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్థికపరమైన ప్రధాన గణాంకాల విడుదల లేకపోవడంతో కోవిడ్–19 సెకండ్ వేవ్ నుంచి జరుగుతున్న అన్‌లాకింగ్, వ్యాక్సినేషన్ తదితర అంశాలు సైతం ట్రెండ్‌కు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషించారు. వీటికితోడు విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరును సైతం ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని తెలియజేశారు.
ఒడిదొడుకులు..
ఈ వారం జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో హెచ్చుతగ్గులకు అవకాశమున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో ట్రేడర్లు జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్‌కు పొజిషన్లను రోలోవర్ చేసుకునే వీలున్నట్లు తెలియజేశారు. కాగా.. సాంకేతికంగా చూస్తే ఈ వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి 15,450–15,900 పాయింట్ల మధ్య పటిష్ట అప్‌ట్రెండ్ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో చార్టుల ప్రకారం నిఫ్టీ 15,400 స్థాయికి ఎగువన కొనసాగితే.. 15,800–15,900 పాయింట్ల వరకూ బలపడే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే 16,050–16,130 పాయింట్లకు చేరవచ్చని అభిప్రాయపడ్డారు. 15,400 దిగువకు చేరితే అప్‌ట్రెండ్‌కు విఘాతం ఏర్పడవచ్చని చెప్పారు.
చమురు ధరల ఎఫెక్ట్
గత వారం ముడిచమురు ధరలు 73 డాలర్ల స్థాయికి చేరడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీయనుంది. వీటికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 90 నుంచి 92కు బలపడింది. 2023లో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు దీనికి కారణంకాగా.. రూపాయి 74 స్థాయికి బలహీనపడింది. గత వారం 1.17 శాతం క్షీణించింది. ఈ అంశాలు సెంటిమెంటును బలహీనపరిచే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా చూస్తే రుతు పవన విస్తరణ, వ్యాక్తినేషన్ వేగం వంటి అంశాలు మార్కెట్ల కదలికలను నిర్దేశించగలవని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, రిలయన్స్ సెక్యూరిటీస్ నిపుణులు బినోద్ మోడీ పేర్కొన్నారు. ఈ వారం మార్కెట్లు కొంతమేర కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చని అంచనా వేశారు.
మిడ్ క్యాప్స్ ఫలితాలు
ఇప్పటికే ఫలితాల సీజన్ ముగింపునకు చేరుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో ఇకపై మరిన్ని క్యూ4, పూర్తి ఏడాది(2020–21) ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా సుమారు 500 మిడ్, స్మాల్ కంపెనీలు ఫలితాలు వెలువడనున్నట్లు తెలియజేశారు.
ఎఫ్‌పీఐల జోరు
గత కొద్ది నెలలుగా దేశీ క్యాపిటల్ మార్కెట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను భారీగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బాటలో జూన్ నెలలో ఇప్పటివరకూ దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ. 13,667 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. కాగా, ఫెడ్ రేట్ల నిర్ణయ ప్రభావం ఇకపై ఎలా ఉంటుందో చూడాలి.