
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నుంచి జియో నెక్ట్స్ ఫోన్ ప్రకటన వెలువడినప్పటి నుంచి దేశమంతటా ఆసక్తి నెలకొంది. ఈ చౌకైన అధునాతన ఫోన్ చేజిక్కించుకునేందుకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫోన్‌ను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో తయారు చేస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన నియోలింక్ ప్లాంట్లలో ఇవి తయారుకానున్నాయి.
సూపర్ ఫీచర్స్
మన దేశ అవసరాలు, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఈ ఫోన్లో ఫీచర్లు పొందు పరిచారు. ముఖ్యంగా పది భాషలను అనువదించే ఫీచర్ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులోని రీడ్ అలౌడ్ ఫంక్షన్ స్క్రీన్‌పై తెరిచిన యాప్‌లో ఉన్న కంటెంట్‌ను బిగ్గరగా చదువుతుంది. వాయిస్ అసిస్టెంట్‌తో ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఇంటర్నెట్ నుంచి కావాల్సిన సమాచారం పొందవచ్చు. సాఫ్ట్‌వేర్ దానంతట అదే అప్‌డేట్ అవుతుందని కంపెనీ తెలిపింది.
హై క్వాలిటీ
ధర తక్కువైనా క్వాలిటీ విషయంలో రిలయన్స్ కాంప్రమైజ్ కావడం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ ప్రాసెసర్‌ను పొందుపరిచారు. జియోఫోన్ నెక్ట్స్ కోసం ఆన్‌డ్రాయిడ్ ఆధారిత అత్యాధునిక ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్‌తో కలిసి జియో ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేసింది. జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ దీపావళి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment