సైబర్ మోసానికి సంబందించిన మరో కేసు తెరమీదకు వచ్చింది. ముంబైకి చెందిన 59 ఏళ్ల రైల్వే అధికారి ఏకంగా రూ. 9 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంతకీ ఇదెలా జరిగింది? ఇలాంటి సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)లో ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (కన్‌స్ట్రక్షన్)గా పని చేస్తున్న వ్యక్తి మొబైల్ ఫోన్‌కు సెప్టెంబర్ 16న వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో జీరో ప్రెస్ చేయకుంటే మొబైల్ నెంబర్ బ్లాక్ అవుతుందని ఉండటంతో.. అతడు జీరో ప్రెస్ చేశారు.
జీరో ప్రెస్ చేయగానే వీడియో కాల్ కనెక్ట్ అయింది. అవతలి వ్యక్తి తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నారు. తనపైన (బాధితుడి మీద) మనీ ల్యాండరింగ్ కేసు నమోదైనట్లు, ఒక నకిలీ జడ్జి ద్వారా చెప్పించారు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ. 9 లక్షలు పంపించకుంటే చర్య తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించారు.
కేసు నిజమేనేమో అని భయపడిన బాధితుడు తన ఖాతా నుంచి రూ. 9 లక్షలు బదిలీ చేశారు. ఆ తరువాత పూర్తిగా మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..
సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే
టెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసి మేము అధికారులము అని చెప్పినా.. మీకు సంబంధించిన వివరాలను అడిగినా.. నిర్థారించుకోకుండా వెల్లడించకూడదు. అనుమానాస్పదమైన కాల్స్ వచ్చినట్లయితే.. పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు వెల్లడించాలి. తెలియని లేదా అనుమానాస్పద వాయిస్ మెసేజస్ లేదా టెక్స్ట్ మెసేజస్ వంటి వాటికి స్పందించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment