న్యూఢిల్లీ: విలాసవంత ఇళ్ల ధరల వృద్ధిలో ముంబై స్థానం అంతర్జాతీయంగా మరింత మెరుగుపడింది. ప్రపంచవ్యాప్త జాబితాలో 92వ స్థానం నుంచి (2021లో) ఏకంగా 37కు చేరుకుంది. 2022 సంవత్సరంలో ముంబైలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 6.4 శాతం పెరిగాయి. ఫలితంగా ముంబై 37వ ర్యాంక్‌కు చేరుకున్నట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అంతేకాదు ముంబై ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇళ్ల మార్కెట్‌గా 18వ స్థానంలో నిలిచింది. ‘ద వెల్త్ రిపోర్ట్ 2023’ని నైట్ ఫ్రాంక్ విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధిని ట్రాక్ చేసే ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పిరి100) 2022లో 5.2 శాతమే పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఈ సూచీ కంటే ముంబైలో విలాసవంతమైన ఇళ్ల ధరలు ఎక్కువ పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 100 పట్టణాల్లోని విలాసవంతమైన ఇళ్ల ధరలను ఈ నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది ముంబైలో ప్రధాన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు 3 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. బెంగళూరులో విలాసవంతమైన ఇళ్ల ధరలు గతేడాది 3 శాతం పెరగడంతో, 2022లో ప్రపంచవ్యాప్తంగా 63వ ర్యాంక్ దక్కించుకుంది. ఢిల్లీలో ఖరీదైన ఇళ్ల ధరలు 1.2 శాతం పెరిగాయి. ఈ జాబితాలో ఢిల్లీ 77వ స్థానంలో ఉంది. 2021లో 93వ ర్యాంకులో ఉండడం గమనించాలి.
దుబాయి చిరునామా..
దుబాయిలో అత్యధికంగా ఖరీదైన ఇళ్ల ధరలు 20 22లో 44.2% పెరిగాయి. నైట్ ఫ్రాంక్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల కేంద్రంగా దుబాయి నిలిచింది. ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధి పరంగా రియాద్, టోక్యో, మియా మి, ప్రాగ్యూ, అల్గర్వే, బహమాస్, అథెన్స్, పోర్టో 2వ స్థానం నుంచి వరుసగా జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment