
సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న టెక్నాలజీలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరస్థులు సామాన్య ప్రజలను టార్గెట్ చేసే వీలుందని ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతా వేదికగా హెచ్చరించారు. ఇటీవల జెమిని నానో బనానా మోడల్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
నానో బనానా
గూగుల్ గత నెలలో జెమిని యాప్‌కు ‘నానో బనానా’ సంబంధించిన ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్‌ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను సృష్టించింది. వేగం, కచ్చితత్వంలో ఇది చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ వంటి ప్రత్యర్థులకంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
సారీ ట్రెండ్..
సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం నానో బనానా 5 ప్రాంప్ట్‌లలో అందుబాటులో ఉంది. తాజాగా బనానా మోడల్ తరహాలోనే ‘సారీ ట్రెండ్’ కూడా వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ టెక్నాలజీలను ఉపయోగించుకుని సామాన్య ప్రజలపై మోసాలకు ఒడిగట్టే అవకాశం ఉంటుందని, వెబ్‌సైట్‌ల్లో ఫొటోలు అప్‌లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సజ్జనార్ చెప్పారు.
నకిలీ వెబ్‌సైట్లు.. అనధికార యాప్‌లు..
‘ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ టాపిక్‌లతో జాగ్రత్తగా ఉండండి! నానో బనానా ట్రెండింగ్ క్రేజ్ ఉచ్చులోపడి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకుంటే, సైబర్ మోసాలు జరగడం ఖాయం. కేవలం ఒక్క క్లిక్‌తో మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నేరస్థుల చేతుల్లోకి చేరుతుంది. ఫొటోలు లేదా వ్యక్తిగత వివరాలను నకిలీ వెబ్‌సైట్లు లేదా అనధికార యాప్‌ల్లో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ ఫొటోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి’ అని సజ్జనార్ ఎక్స్‌తో చెప్పారు.
ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ