ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ భారత్ పే' ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో కంపెనీలో సహ వ్యవస్థాపకుడిగా ఉన్న అష్నీర్ గ్రోవర్‌కు భారత్‌పే అన్నీ పదవుల నుంచి తొలగించింది. అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత్ పే ఒర్జినల్ ఫౌండర్ భావిక్ కొలాడియాకు, సంస్థ మేనేజ్మెంట్‌కు మధ్య కొత్త వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీనంతటికి కారణం ఎవరి వాటా ఎంతో క్లారిటీ లేకనే సంస్థలో గొడవలు జరుగుతున్నాయనే వాదనలు తెరపైకి వచ్చాయి.
వాస్తవానికి భావిక్ కొలాడియా భారత్ పే ప్రారంభంలో కన్సల్టెంట్‌గా ఉన్నారు. అదే సమయంలో అమెరికాలో ఓ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కేసులో కొలాడియా దోషిగా తేలడంతో భారత్‌పే అతన్ని పక్కన పెట్టింది. కంపెనీ బాధ్యతల్ని, వాటాల్ని అష్నీర్ గ్రోవర్ - శశ్వాత్ నక్రాణిలే పంచుకున్నారు. కొలాడియాను వదిలేశారు. దీంతో కొలాడియాకు, అశ్‌నీర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో కంపెనీ వాటాల విషయంలో అష్నీర్ ఆడియో టేపులు వెలుగులోకి రావడంతో కొలాడియా అప్రమత్తమయ్యారు. భారత్‌పే లో తన వాటా ఎంత? మార్చి 1 నుంచి ఉద్వాసనకు గురైన అష్నీర్ వాటా ఎంతో తేల్చుకునేందుకు లాయర్లను సంప్రదించారు. ఇప్పుడీ అంశం ఫిన్ టెక్ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది. కాగా, అష్నీర్ గ్రోవర్ , శశ్వాత్ నక్రాణి, భావిక్ కొలాడియాలు కంపెనీలు వాటాల కోసం రోడ్డెక్కి చివరికి సంస్థను ఏం చేస్తారోననే మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment