
ముంబై: ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై గట్టిగానే పడింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 1800 పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైంది. 55 వేల 997 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో 2,850 పాయింట్లు పతనమై 54 వేల 383 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నాటో దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నామంటూ ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా చర్యలకు ప్రతిచర్య తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి సైనిక చర్య మొదలైపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తారు. ప్రపంచంలో రెండు అగ్రరాజ్యల(పరోక్షంగా అమెరికాతో) మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక మదుపరులు తమ పెట్టబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై యుద్ధ ప్రభావం భారీగానే కనిపించింది. దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, నాటో దళాలు కనుకు ప్రతిచర్యలకు దిగితే మార్కెట్లు మరింత పడిపోయ అవకాశం ఉంది.
ముగింపులో, సెన్సెక్స్ 2,702.15 పాయింట్లు (4.72%) క్షీణించి 54,529.91 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 815.30 పాయింట్లు(4.78%) నష్టపోయి 16,248.00 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పెరిగి రూ.75.69 వద్ద ఉంది. ఈరోజు నిఫ్టీ, సెన్సెక్స్‌లో ఏ ఒక్క షేరు కూడా లాభపడలేదు. టాటా మోటార్స్ 10 శాతానికిపైగా పడిపోయింది. యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రేసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతానికిపైగా డీలాపడ్డాయి. అన్ని సెక్టోరల్ సూచీలు 3-8 శాతం నష్టంతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు 2-6 శాతం మేర పడిపోయాయి.బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 5 శాతం చొప్పున పతనమయ్యాయి.