
ముంబై: బ్యాంకింగ్, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగడంతో స్టాక్ సూచీలు రెండోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సెంటిమెంట్ మరింత బలహీనపడింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి.
అయితే చివర్లో రియల్టీ, ఫార్మా షేర్లకు రాణించడంతో నష్టాలు కొంత మేరకే పరిమితం అయ్యాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 59,991 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 534 పాయింట్ల పరిధిలో 59,579 వద్ద కనిష్టాన్ని, 60,113 గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 184 పాయింట్లు నష్టపోయి 59,727 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 17,767 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 17,610–17,767 శ్రేణిలో కదలాడింది. చివరికి 47 పాయింట్ల పతనమై 17,660 వద్ద స్థిరపడింది. ఐటీ, మెటల్, ఫార్మా రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్ సూచీ అరశాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం చొప్పున లాభపడ్డాయి.
‘‘అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం ఫలితాలు బలహీనంగా నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.810 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.401 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ రిజర్వ్‌తో సహా ఇతర కేంద్ర బ్యాంకులు కఠినతర ద్రవ్య విధాన వైఖరిని అవలంభించవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
►కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత మార్కెట్లోకి వచ్చిన తొలి ఐపీఓ అవెలాన్ టెక్నాలజీస్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.436)తో పోలిస్తే ఒకశాతం డిస్కౌంట్‌తో రూ.431 వద్ద లిస్టయింది. ఒక దశలో 11 శాతం క్షీణించి రూ.388 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 9% నష్టపోయి రూ.397 వద్ద నిలిచింది.
►ఎక్సే్చంజీలో మొత్తం 3.17 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ వ్యాల్యుయేషన్ రూ.2,595 కోట్లుగా నమోదైంది.
►సోడా యాష్ ధరలు 3–4 శాతం తగ్గించడంతో టాటా కెమికల్స్ షేరు 6% నష్టపోయి రూ.932 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 6.50% క్షీణించి రూ.926 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.