
సాక్షి, ముంబై: గత వారపు భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు సోమవారం కోలుకున్నాయి. దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలతో పాటు దేశీయంగా సానుకూల జీడీపీ వృద్ధి రేటు, వాహన విక్రయాలు పుంజుకోవడం వంటివి మదుపర్లలో విశ్వాసం నింపాయి. దీనితో ఉదయం 49,747 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 50,058 వద్ద గరిష్ఠాన్ని.. 49,440 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఉదయం 14,772 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. రోజులో 14,806-14,638 మధ్య కదలాడింది.
చివరకు సెన్సెక్స్ 749 పాయింట్ల(1.53 శాతం) లాభంతో 49,849 వద్ద ముగియగా నిఫ్టీ 232 పాయింట్లు 232.40(1.60 శాతం) పైకి చేరి 14,761 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.50 వద్ద చేరుకుంది. సెన్సెక్స్ టాప్ 30లో ఒక్క భారతీ ఎయిర్‌టెల్ మినహా మిగిలిన కంపెనీల షేర్లన్నీ లాభాలను ఒడిసిపట్టాయి. టెలికాం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్, యూపీఎల్ షేర్లు ఐదు శాతానికి పైగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్ మాత్రం 4.22 శాతం నష్టాల్ని చవిచూసింది.
చదవండి: