న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాల బలోపేతం (ఇన్‌ఫ్రా), పెట్టుబడులు, ఆవిష్కరణలు, అందరికీ ఆర్థిక ఫలాలు (సమ్మిళితత్వం) అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ధేశించిన అభివృద్ధి భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కావాల్సిన అన్ని సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర సర్కారు పెట్టుబడిదారుల అనుకూల సంస్కరణలు ఎన్నింటినో తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. భారత్‌లో శక్తివంతమైన యువ జనాభా ఉందంటూ, ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా వారికి కావాల్సిన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు.
25 ఏళ్లలో సాధించేందుకు..
‘‘మౌలిక సదుపాయాల కల్పనను పెద్ద ఎత్తున చేపట్టాం. గత 3–5 ఏళ్లలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాలు పెద్ద ఎత్తున పెంచడంతో 2023–24 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. మౌలిక సదుపాయాలు అనేవి పెట్టుబడుల వల్లే సాధ్యపడతాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. మౌలిక సదుపాయాలు అంటే కేవలం బ్రిడ్జ్‌లు, రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులే కాకుండా, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. అలాగే, ఆవిష్కరణలను సైతం ప్రోత్సహిస్తున్నాం. అంతరిక్షం, అణు ఇంధనం విభాగాల్లో అవకాశాలకు ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. అలాగే సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నేడు యువత తగిన పరిష్కారాలను అందిస్తుందని విశ్వసించేందుకు తగిన కారణాలు ఉన్నాయి. చివరిగా అందరికీ ఆర్థిక ఫలాలను అందించడం ద్వారా 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. కనుక భారత్‌లో ప్రతీ వర్గం, సామాన్య వ్యక్తి కూడా ప్రభుత్వం చేపట్టే పెట్టుబడులు, సంస్కరణలు, తదితర చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారు’’అని మంత్రి సీతారామన్ ప్రభుత్వ లక్ష్యాలను
వివరించారు.
జీ20 ముందు ఎన్నో లక్ష్యాలు
జీ20 కూటమికి అధ్యక్ష స్థానంలో భారత్ చేస్తున్న కృషిని సైతం మంత్రి సీతారామన్ ప్రస్తావించారు. కరోనా అనంతరం ఎదురైన సవాళ్ల పరిష్కారం, పునరుద్ధరణ ప్రణాళికలపై పనిచేస్తున్నట్టు చెప్పారు. 21వ శతాబ్దపు సవాళ్లను మలీ్టలేటరల్ బ్యాంకులు ఎలా పరిష్కరించగలవనేది తమ తొలి ఏజెండా అని చెప్పారు. మార్కెట్, ప్రైవేటు రంగం నుంచి అవి మరిన్ని నిధులను తీసుకురాగల సామర్థ్యాలు కలిగి ఉన్నట్టు తెలిపారు. చాలా దేశాలు ఎదుర్కొంటున్న రుణ భారం కూడా తమ అజెండాలో ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వేగంగా రుణ భారాన్ని ఎలా పరిష్కరించుకోగలమన్న దానిపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. శ్రీలంకను ఈ సందర్భంగా ప్రస్తావించారు. క్రిప్టో కరెన్సీలపై సెంట్రల్ బ్యాంకుల నియంత్రణ అవసరాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైతే భారత్ నియంత్రణ విషయంలో తొందర పడడం లేదని చెబుతూ.. ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సంకేతం ఇచ్చారు. ఇది టెక్నాలజీ ఆధారంగా నడిచే కరెన్సీ కనుక దీనిపై నియంత్రణ అవసరమన్నారు. అన్ని దేశాలు ఉమ్మడి వైఖరిని అనుసరించినప్పుడే దీని నియంత్రణ సాధ్యమని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలన్నవి తమ నాలుగో ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు తెలిపారు. ఈ విషయంలో భారత్ తన సామర్థ్యాలు ఏంటో చూపించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment