రాష్ట్రంలో పవర్‌ హాలిడే లేదు - పరిశ్రమలకు పరిమితుల తొలగింపు  | No Power holiday for industries details | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పవర్‌ హాలిడే లేదు - పరిశ్రమలకు పరిమితుల తొలగింపు 

Published Tue, Sep 5 2023 1:03 PM | Last Updated on Tue, Sep 5 2023 1:03 PM

No Power holiday for industries details - Sakshi

అమరావతి: రాష్ట్రంలో పవర్‌ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాపై ఎలాంటి పరిమితులు అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. ఈమేరకు సోమవారం ప్రకటన విడుదల చేశాయి. విద్యుత్‌ డిమాండుకు అనుగుణంగా సరఫరా పరిస్థితి మెరుగుపడినందున పరిశ్రమలకు సరఫరాలో పరిమితులు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో ఆదివారం అన్నిరంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసినట్లు వివరించాయి. రాష్ట్రంలో మొత్తం 206.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సరఫరాలో ఎలాంటి అంతరాయాలుగానీ, లోడ్‌ షెడ్డింగ్‌ లేదు.

సెప్టెంబర్‌ 1 వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్‌ డిమాండ్‌ – సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి  కొద్ది  మేర  విద్యుత్‌ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలను ప్రాధాన్యం ఇచ్చి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేశాయి. వ్యవసాయ, గృహ వినియోగరంగాలను పాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని  విద్యుత్‌ సంస్థలు  భావించాయి.

ఇందులో భాగంగానే డిమాండు ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేస్తామని గౌరవ కమిషన్‌ కు అభ్యర్ధన పంపించాం. విద్యుత్‌ పంపిణీ  సంస్థల అభ్యర్ధన మేరకు గౌరవ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి 2023 సెప్టెంబర్ 09న ఈనెల 5 వ తేదీ నుంచి రాష్ట్రంలో  పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్‌ వాడకంలో పరిమితులు విధించవచ్చని కమిషన్‌ అనుమతించింది. 

తగ్గిన డిమాండుతో పరిశ్రమలకు పరిమితుల తొలగింపు
మారిన వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అల్పపీడన పరిస్థితులలు, వర్షాల దృష్ట్యా  గ్రిడ్‌ డిమాండ్‌ కొంత మేర తగ్గింది. గత రెండు రోజులుగా ఎటువంటి విద్యుత్‌ కొరత లేదు. విద్యుత్‌ సౌధలో సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె. విజయానంద్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీపీసీసీ అధికారులతో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్‌ డిమాండు, సరఫరా పరిస్థితిపై కూలంకుషంగా సమీక్షించారు. 

ప్రస్తుతం లోడ్‌ కొద్దిమేర తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడి నందువల్ల  పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్‌ షెడ్డింగ్‌ విధించే అవసరం కలగదని ఈ సమీక్ష సందర్భంగా భావించారు. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్‌ వాడకంపై పరిమితి నిబంధనల అమలును రద్దు చేసుకున్నాయి.

 దయచేసి వినియోగదారులందరూ ఈ విషయాన్ని గ్రహించగలరని రాష్ట్రంలో ఏవిధమైన లోడ్‌ షెడ్డింగ్‌ కానీ, విద్యుత్‌ వాడకంలో పరిమితులు కానీ లేవని తెలియజేస్తున్నాం. మెరుగుపడిన సరఫరా పరిస్థితి వల్ల కమిషన్‌ ఇచ్చిన పారిశ్రామిక  విద్యుత్‌  వాడకంలో  పరిమితి – నియంత్రణ  ఉత్తర్వులను అమలు చేయడం లేదు. ఈ విషయం గౌరవ కమిషన్‌ కు నివేదించాలని పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

సెప్టెంబర్‌ నెల 15వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్‌ నుంచి రోజుకి దాదాపు 40 మిలియన్‌ యూనిట్లు, ప్రతి యూనిట్‌కు రూ . 9.10 వెచ్చించి వినియోగదారుల సౌకర్యార్ధం కొంటున్నాం. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా నిరంతరాయం అధికారులందరూ అప్రమత్తంగా వున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా  గృహ, వ్యవసాయ, వాణిజ్య & పారిశ్రామిక రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement